త్రివిక్రమ్ మార్క్ ...

హాయిగా చూడదగ్గ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అ ఆ’ చిత్రం.
త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో రూపొందిన “అ, ఆ” లో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, నదియా, రావురమేష్, నరేష్, జయప్రకాష్, అవసరాల శ్రీనివాస్ గిరిబాబు, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.
అసలు అందమే “అ, ఆ” అనే టైటిల్ తో మొదలైంది ఈ చిత్రానికి.

అనసూయ రామలింగం పాత్రలో నటించిన సమంత అమ్మ చేతిలో తాను ఓ ఆటబొమ్మలా మారిపోయినట్టు , స్వేచ్చ అనేది కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. ఆమెకు ఇష్టం లేని పెళ్లి చెయ్యడానికి ఇంట్లో వారు నిర్ణయించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అప్పటికీ ఆమె తల్లిగా మహాలక్ష్మి పాత్రలో నటించిన నదియా వైఖరిలో మార్పు ఉండదు. ఈ క్రమంలో తల్లి ఓ పని మీద ఊరుకి వెళ్తుంది. అప్పుడు అనసూయ పల్లెలోని ఉంటున్న తన అత్తయ్య వాళ్లింటికి వెళ్తుంది. అత్తయ్య కొడుకు ఆనంద్ విహారిని ఇష్టపడుతుంది. ఆనంద్ పాత్రలో నితిన్ నటించాడు. కానీ అనసూయ అమ్మ అంటే ఆనంద్ వాళ్ళ కుటుంబానికి అస్సలు నచ్చదు. అంతే కాదు ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలోనూ తేడా లేకపోలేదు. కనుక ఎందుకొచ్చిన గొడవ అన్నట్టు ఆనంద్ అనసూయకు ఎడంగానే ఉంటుంటాడు. మరోవైపు ఆనంద్ పైగా అతను అనుకోని కారణాలవల్ల మరో అమ్మాయితో పెళ్ళికి మాటిస్తాడు. కొన్ని రోజులకి అనసూయ తన ఇంటికి చేరుకుంటుంది. వాళ్ళ అమ్మ ఊరు నుంచి తిరిగి రావడంతోనే అనసూయకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. ఈ స్థితిలో అనసూయ, ఆనంద్ ఒక్కటయ్యేరా లేదా అని తెలుసుకోవాలనుకుంటే వెండితెరపై మిగిలిన కథ చూడాలి.

త్రివిక్రమ్ రచన, కథనం ఆయన సినిమాలకు శక్తి. ఫ్యామిలీ కథల్ని చెప్పడంలో ఆయన అవలంబించే పంధా భలేగా ఉంటుంది. అందులో ఏదో ఓ స్పార్క్ ఉండకపోదు. ఈసారి వినోదంతోపాటు కాస్తంత ఉద్వేగానుభూతినీ కలిపి ప్రేక్షకుల ముందుంచారు త్రివిక్రమ్. కొన్ని చోట్ల సన్నివేశాలు కాస్త గతి తప్పేయా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర కోసం రాసిన మాటల్లో త్రివిక్రమ్ చమక్కులు మెరిసాయి. కొన్ని సందర్భాలలో ఎటువంటి హడావుడి లేకుండా చాలా మామూలు మాటలతో సాగిపోయే సన్నివేశాలు లేకపోలేదు.

నితిన్ తన పాత్రకు అన్ని విధాల న్యాయం చేసాడు. సమంత నటన అద్భుతం. ఆమె నటన మరవలేనిది. రావు రమేష్, నదియాలు కూడా బాగా నటించారు.

మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. పాటలకు తగిన స్వరాలూ సమకూర్చాడు.

మొత్తంమీద చూడదగ్గ చిత్రం “అ, ఆ”.

Send a Comment

Your email address will not be published.