దమ్ములేని "షేర్"

మల్లికార్జున్ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వచ్చిన షేర్ చిత్రంలో కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, రావు రమేష్, రోహిణి, ఆలీ, షాయాజి షిండే, ముకేష్ రుషి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిం చారు.

ఈ చిత్రానికి సంగీతం తమన్ స్వరపరచగా డైమండ్ రత్నబాబు కథ, మాటలూ రాశారు.

ఈ చిత్రానికి నిర్మాత కొమర వెంకటేష్.

ఆ మధ్య వచ్చిన పటాస్ చిత్రంతో నిలదొక్కున్నాడనుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాదిలో ఈ రెండో సినిమాను ప్రేక్షకుల ముందుంచాడు.

గౌతమ్ పాత్రలో కళ్యాణ్ రామ్ తన కుటుంబానికి అండగా నిలిచిన యువకుడి పాత్రలో నటించాడు. . అతడికి తల్లిదండ్రులన్నా తమ్ముడన్నా ఎంతో ఇష్టం. తన మిత్రుడు ఇష్టపడ్డ అమ్మాయిని పప్పీ పాత్రలో నటించిన విక్రమ్ జీత్ మాలిక్ అనే రౌడీ బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నప్పుడు తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయిస్తాడు గౌతమ్. తాను పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయిని తనకు కాకుండా చేసాడన్న కారణంగా పప్పీ గౌతమ్ మీద పగ పెంచుకుంటాడు.

ఇంతలో గౌతమ్ ఓ అమ్మాయిని (నందిని పాత్రలో సోనాల్ చౌహాన్) ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని తాను పెళ్లి చేసుకుంటానని పప్పీ సవాల్ విసురుతాడు. అంతేకాదు ఆ అమ్మాయిని లేపుకొచ్చేస్తాడు.
అనంతరం పధకం ప్రకారం పప్పీ దగ్గర చేరి అతని వెనుక ఉన్న వాళ్ళను ఒక్కొక్కరినే చంపుతాడు గౌతమ్. నందిని కోసమే ఇదంతా చేస్తున్నట్లు నమ్మించిన గౌతమ్ వెనుక అసలు కారణం మరొకటుంది. అదేమిటో తెలుసుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే.

రొటీన్ గా సాగిపోయిన ‘షేర్’ చిత్రం చూస్తున్న కొద్దీ విసుగు పుడుతుంది.

దర్శకుడు మల్లికార్జున్ ఈ చిత్రం మీద అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టక ఎప్పట్లాగే మాస్ మసాలా అంశాలమీద దృష్టి పెట్టాడు. ఈ చిత్రం నవ్వులనుకున్న కామెడీ అసలు క్లిక్ కాలేదు. నిరాశ మిగిల్చిన కథాకథనాలతో ఎందుకురా బాబూ ఈ సినిమాకు వచ్చాం అన్నట్టుగా ఉంది షేర్ .
పృథ్వీ ‘చిరాగ్గా’ అనే ఊతపదంతో కొన్ని పంచులేసి కాస్తంత నవ్వించాడు.

కళ్యాన్ రామ్ నటనలో కొత్తగా ఏదీ కనిపించలేదు. అతని సరసన సోనాల్ చౌహాన్ చలాకీతనం కాస్త ఆకట్టుకుంటుంది. గ్లామరస్ గానే కనిపించింది. రావు రమేష్, రోహిణి తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మానందం జోకులు డోకులే. ఆలీ నయం.

Send a Comment

Your email address will not be published.