నన్ను మోసం చెయ్యలేదు

సినిమా అంటే అంటరానిదిగా చూసిన రోజులవి. సంప్రదాయ బద్దమైన కుంటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన అమ్మాయిని ఎంత ఘోరంగా తలుస్తారో వేరేగా చెప్పక్కరలేదు. అయినా ఈ రంగంలోకి రావాలని వచ్చి నిలదొక్కుకున్న వాళ్ళు కొందరైతే నిలబడని వాళ్ళు ఎందరో. అటువంటి స్థితిలో అనుకోకుండానే వచ్చి నిలబడగలిగిన నటి షావుకారు జానకి. ఈ సినీ రంగాన్ని నమ్ముకుని వచ్చినందుకు ఈ కళామతల్లి తనను మోసం చేయలేదు అని ఆమె సగర్వంగా చెప్పుకున్నారు. ఈ చిత్రరంగం తనకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అనునయించింది అని ఆమె తెలిపారు. బయటివారు అనుకునేంత అశ్లీలం, అవినీతి, అగౌరవం తనకు ఈ రంగంలో కనిపించలేదని ఆమె చెప్పారు. 1949 లో మూడు నెలల శిశువు యజ్ఞప్రభను పొత్తిళ్ళలో పెట్టుకుని ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్, బీ ఎన్ రెడ్డి గారు ఎంతగానో ఓదార్చి ఆమెను షావుకారులో నటింప చేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలు బాగా రావడం ఆమెకు లాభించింది. ఆర్టిస్టుగా నిల్చోవడానికి ఈ భాషలు, నటన దోహదపడ్డాయి అని ఆమె చెప్పారు. మనసుకు నచ్చని దానిని నిర్మొహమాటంగా చెప్పేసే షావుకారు జానకిగారిది రాజీ పడే మనస్తత్వం కాదు. నటించే పాత్రల విషయంలో ఎలా రాజీ పద లేదో జీవితంలోను ఆమె రాజీ పడ లేదు. కృత్రిమంగా బఠాకడమంటే ఏ మాత్రం ఇష్టం లేని ఆమె ఒకసారి మాట్లాడుతూ ఈ చిత్ర రంగంలో పురుషాధిక్యత వద్దన్నా కాదన్నా తప్పదనేది సత్యం…..కౌసల్యా దేవి, శరత్ నవలలు ఎన్ని చిత్రాలుగా వచ్చినా సింపతీ వస్తే రావచ్చేమోగానీ స్థిరమైన పేరు ఏదీ హీరోయిన్లకు రాలేదని అభిప్రాయపడ్డారు.

Send a Comment

Your email address will not be published.