నయనతార చరణ్ కి పిన్నా?

అందాలతార నయన తార చరణ్ కి పిన్ని అవుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం సినీ అభిమానులతో పాటు, సినిమా పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. స్కిన్ షోకి ఏమాత్రం అదర కుండా, బెదరకుండా సై అనే నయన తార ముందు ఇప్పుడు కొన్ని వేల మిలియన్ డాలర్ల ప్రశ్న ఉంది. రామ్ చరణ్ కి పిన్ని గా నటించాలా, వద్దా అని.

అగ్ర హీరోల పక్కన చేస్తే స్టార్ హీరోయిన్ అయినట్టే. నయన తార ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వెంటనే అలాంటి అదృష్టమే ఆమెకి దక్కింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ సరసన చంద్రముఖిలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో నయన తారకి అగ్ర హీరోలు అందరి తరుపునా నటించే అవకాశం వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా వెంకటేష్, నాగార్జున, బాల కృష్ణ వంటి అగ్ర హీరోలతో నటించి సూపర్ హిట్స్ సాధించడంతో పాటు వారికి సరి అయిన జోడీ అనిపించుకొంది. అయితే ఇప్పుడు ఆమె కెరీయర్ కి అదే అడ్దంకి అయింది. అందరూ సీనియర్ హీరో లతో నటించడం వల్ల ఇప్పుడు కుర్ర హీరోలతో నటించే ఛాన్స్ మిస్ అవుతోంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న నయన తార ఇంక నుంచీ తానూ జూనియర్ హీరోలతోనే చేయాలని డిసైడ్ అయింది. అందుకు తగ్గట్టు గానే ఆర్య, అజిత్, స్టాలిన్, ఉదయనిధి, గోపీ చాంద్ వంటి యంగ్ హీరోలతో నటిస్తోంది.

అయితే ఇప్పుడు నయన ముందు టెంప్ట్ చేసే ఆఫర్ ఉంది. అది విక్టరీ వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం. తెలుగు ఇండస్ట్రీ కి తనను పరిచయం చేసిన హీరో పక్కన తిరిగి చేసే అవకాశం. పైగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో. ఇంకేముంది అనుకోబోతుండగా ఆ పాత్ర చెర్రీకి చిన్నమ్మ పాత్ర అని చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాలో వెంకటేష్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాణంలో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ చెర్రీకి బాబాయిగా నటిస్తున్నాడు, చెర్రీ కి జోడీగా ఇప్పటికే కాజోల్ అగర్వాల్ ని ఎంపిక చేశారు. వెంకటేష్ పక్కన నయనని నటించమని కోరితే ఇంకా సమాధానం చెప్పలేదట. చెర్రీకి పిన్నిగా నటిస్తే తనకి సీనియర్ నటీమణిగా పేరు పడి భవిష్యత్ లో ఇంక హీరోయిన్ ఛాన్స్ లు రావేమో అని అలోచిస్తుందట. మరో వైపు మల్టీ స్టార్ సినిమా. అందుకే ఏమీ చెప్పకుండా నానపెడుతోందని ఫిలిం నగర్ జనాలు అనుకొంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ చరణ్ కి పిన్ని అవుతుందా, కాదా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Send a Comment

Your email address will not be published.