నాకో పెను సవాల్

మా అంకుల్ విజయేంద్ర ప్రసాద్ సినిమాకు సంగీతం స్వరపరచడం తనకో పెను సవాల్ అని ప్రముఖ సంగీతదర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ అన్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయేంద్ర ప్రసాద్ సినిమా సైంటిఫిక్ థ్రిల్లర్ అని, అది మహిళా ఓరియెంటెడ్ కథాంశమని ఆమె అన్నారు. అందులో సంగీతం ఓ భాగమని, అదేదో రొటీన్ గా వచ్చే చిత్రం కాదని, దీనిని ఓ చాలెంజ్ గా తీసుకుని సంగీతం అందిస్తున్నట్టు తెలిపారు శ్రీలేఖ.

ఈ చిత్రంలో కొన్ని పాటలు ఉన్నాయని, అవి కథతోపాటే సాగే పాటలని, ఎప్పుడూ వచ్చే డ్యూయెట్ సాంగ్స్ కావని, కొత్త తరహాలో ఉండే పాటలని, వీటికి సంగీతం సమకూర్చడం చాలా ప్రధానమని, మా అంకుల్ కి అంతా పెర్ఫెక్ట్ గా ఉంటే తప్ప ఒప్పుకోరని, తాను తన సోదరుడి కూతురు కదాని రాజీపడటం వంటివి ఉండవని, ఆయన అంత ఈజీగా ఏదీ అంగీకరించరని ఆమె అన్నారు. పనిలో దిగిన తర్వాత ఆయన తనను ఒక టెక్నీషియన్ గానే చూస్తారు తప్పించి అక్కడ బంధాలు వంటివి పని చేయవని, సరైన రీతిలో సంగీతం రాబట్టుకోవడం కోసం ఆయన తనకు కథ ఎప్పటికప్పుడు చెప్పేవారని, మరింత మెరుగ్గా ఎలా సంగీతం ఉండాలో చెప్పే వారని అన్నారు. అదేసమయంలో తనకు నచ్చిన చోట ప్రశంసించడంలో ఏ మాత్రం ఉత్తినే ఉండక బాగా ప్రోత్సహించేవారని అన్నారు. ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నానని, ఇది తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని ఆమె చెప్పారు.

ప్రస్తుతం తాను మౌనం అనే మరో సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నానని చెప్పిన శ్రీలేఖ 1995 లో తన పన్నెండో ఏట టాలీవుడ్ లో తాజ్ మహల్ చిత్రంతో రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాలాలో దాదాపు 75 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళం భాషా చిత్రాలలో ఆమె మూడు వేలకు పైగా పాటలు పాడారు.

Send a Comment

Your email address will not be published.