నాది కామిక్ విలన్ పాత్ర

టాలీవుడ్ లో మరోసారి బాలీవుడ్ కి చెందిన కామెడీ విలన్ కనిపించబోతున్నారు. ఆయన పేరు విక్రంజీత్ విర్క్. ఆయనకిది మొదటి తెలుగు చిత్రం కాదు. అంతకుముందు ఆయన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు ఆయన చేస్తున్న తెలుగు  చిత్రం పేరు షేర్.  

ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇందులో తనది కామిక్ విలన్ పాత్ర అని విక్రంజీత్ విర్క్ చెప్పుకున్నారు. టాలీవుడ్ లో తాను మరోసారి కనిపించబోవడం తలచుకుంటూ ఉంటే ఎంతో  హ్యాపీగా ఉందని ఆయన అన్నారు.  

షేర్ చిత్రంలో కథానాయకుడు నందమూరి కళ్యాన్ రామ్. ఈ చిత్రంలో తనది సందర్భానుసార కామెడీ విలన్ పాత్ర తప్ప ఫుల్ టైం కాదని విక్రంజీత్ చెప్పారు. తనకు కామెడీ విలన్ పాత్ర ఇచ్చిన చిత్ర దర్శకుడు మల్లికార్జునను విక్రంజీత్ విర్క్ కొనియాడారు. గతంలో మల్లికార్జున పూరీ జగన్నాధ్ తో కలిసి పని చేయడం వల్ల అప్పుడే మల్లికార్జునతో  తనకు పరిచయమేర్పడిందని విక్రంజీత్ విర్క్ తెలిపారు.  

మల్లికార్జునతో వర్క్ చేయడం పూరీగారితో కలిసి వర్క్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందని చెప్పారు.  

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చే నటులకు తెలుగు భాష సరిగ్గా రాక సందర్భానికి తగ్గట్టు నటించరనే విమర్శలు వస్తూ ఉంటాయన్న దానిపై విక్రంజీత్ విర్క్ మాట్లాడుతూ అది కొంత వరకు నిజమేనని ఒప్పుకున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వాస్తవమని, కొన్ని సమయాల్లో తాము సరిగ్గా అర్ధం కాక తడబడుతామని, అందుకే కొన్నిసార్లు తాము అనుకున్నంత గొప్పగా హావభావాలు ప్రదర్శించ లేకపోవచ్చని చెప్పారు. ఈ సమస్యని అధిగమించడానికి తాను మేకప్ అవడంతోనే సహాయ దర్శకుడి వద్దకు వెళ్లి తన పాత్ర, సన్నివేశం, సంభాషణలు వగైరా తెలుసుకుని డైలాగులను ఇంగ్లీషులోకానీ హిందీలో కానీ రాసుకుని ప్రాక్టీస్ చేస్తానని విక్రంజీత్ విర్క్ చెప్పారు. తాను చేయవలసిన సన్నివేశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని నటిస్తానని చెప్పారు. తాను చెప్పవలసిన మాటల అర్ధాలను కూడా బాగా తెలుసుకుని, అందుకు తగ్గట్టే నటించడానికి అంకిత భావంతో కృషి చేస్తానని తెలిపారు. తాను క్రమంగా తెలుగు భాషకు దగ్గరవుతున్నానని కూడా చెప్పారు విక్రంజీత్ విర్క్.  

తెలుగు మాట్లాడటం నేర్చుకున్నానని, కొన్ని సార్లు తడబడుతున్నానని, కొన్ని సార్లు పరవాలేదని చెప్పారు. టాలీవుడ్ లో ప్రోఫెసనలిజం ఎక్కువని, అందుకే టాలీవుడ్ పై దృష్టి మలిచానని విక్రంజీత్ విర్క్ చెప్పారు. షూటింగ్ కి ఉదయం ఏడు గంటలకు ఉండాలి అని దర్శకుడు చెప్తే నటీనటులందరూ ఆ టైం కి కచ్చితంగా సెట్స్ లో ఉంటారని, అది తనకెంతో నచ్చిన అంశమని విక్రంజీత్ విర్క్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.