నానీ సరసన సురభి

బీరువా సినిమాతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన సురభి ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నానీ సరసన నటిస్తోంది.

డిల్లీకి చెందిన సురభి నటించి గత నెలలో విడుదలైన “ఎక్స్ ప్రెస్ రాజా” అనే తాజా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అందుకు ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ తాను స్కూల్ లో చదువుకుంటున్న రోజుల నుంచే సినిమాలంటే ఇష్టమని, స్కూల్ రోజుల్లో అనేక షోస్ లో పాల్గొంటూ ఉండే దానినని చెప్పింది.

ఆమెకు మొదటిసారిగా 2013లో తమిళంలో ఒక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు ఆమె కాలేజీ లో సెకండ్ ఇయర్ చదువుతోంది. అప్పుడు అటు చదువునీ, ఇటు నటనని బ్యాలన్స్ చేసుకుంటూ వచ్చానని, పరీక్షలు దగ్గర పడినప్పుడు చదువు మీదే దృష్టి పెట్టే దానినని, పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ షూటింగులకు టైం చూసుకుంటూ ఉండేదానినని సురభి చెప్పింది.

ఫైన్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన సురభికి పెయింటింగ్ అంటే మహా ఇష్టం. ప్రకృతికి సంబంధించిన బొమ్మలు ఎక్కువగా గీసే సురభి మాట్లాడుతూ తాను ఇప్పుడు ఎక్కువగా ప్రయాణం చేస్తుండటం వల్ల ప్రకృతిని, ప్రదేశాలను గమనించి మనసుకి నచ్చిన దృశ్యాలను గీయడం జరుగుతోందని తెలిపింది.

ప్రస్తుతం నానీతో నటిస్తున్న చిత్రం తాలూకు ఓ షెడ్యూల్ పూర్తి అయిందని, తమిళంలో రెండు చిత్రాలు చేసిన తర్వాత తెలుగులో మొదటి చిత్రంగా బీరువాలో నటించానని ఆమె తెలిపింది. బీరువా చిత్రంలో సందీప్ కిషన్ తో నటించిన సమయంలో తామిద్దరం కలిసి చెన్నైలో ఒక తమిళ సినిమాకు చెయ్యవలసిందని, అయితే ఇద్దరం ఆ అవకాశాన్ని డ్రాప్ చేసుకుని తెలుగులో ఒక్కటిగా నటించామని అన్నాది . బీరువా సినిమాలో తన నటన నచ్చి మేర్లపాక గాంధి ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో అవకాశం ఇచ్చారని, ఆ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చినందుకు ఆనందంగా ఉందని సురభి చెప్పింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “అటాక్” అనే చిత్రంలోనూ సురభి నటించింది. ఆర్జీవీ తో వర్క్ చేయడం ఓ గొప్ప అనుభవమని అంటూ ఆయన ఎప్పుడూ ఓ పెద్ద దర్శకుడిలా ఉండేవారు కాదని, సెట్స్ లో ఆయన పూర్తి స్వేచ్చ ఇచ్చేవారని, ఆయనతో పని చేయడం ఎంతో హాయిగా ఉండేదని తెలిపింది. ఆయన ఇచ్చిన సలహాలూ, చేసిన సూచనలతో తాను నటనను మెరుగుపరచుకున్నానని చెప్తూ అందుకే ఆర్జీవిని తాను గురువుగారూ అని పిలుస్తానని అన్నాది.

తాను ఒక సినిమా చేయడానికి ముందు ఆ సినిమాకి దర్శకుడు ఎవరు? అనేది చూసుకున్న తర్వాత కథ ఎలాంటిదో చూస్తానని, ఆ రెండూ తనకు నచ్చితే సినిమా చేయడానికి సమ్మతిస్తానని చెప్పింది సురభి. అలాగే అందులో తన క్యారక్టర్ ఏమిటో కూడా చూసుకుంటానని, ఆ తర్వాతే మిగిలిన విషయాలన్నీ అని చెప్పింది.

తెలుగు తాను మాట్లాడలేకపోయినప్పటికీ అర్ధం చేసుకోగలనని అంటూ రానున్న రోజుల్లో ఓ పెయింటింగ్ ప్రదర్శనఏర్పాటు చేసి తాను గీసిన చిత్రాలను ప్రదర్శించాలని ఉందని చెప్పింది. ఇందుకు నాలుగైదు సంవత్సరాలు పడుతుందని కూడా చెప్పింది. తన తల్లి కూడా ఆర్టిస్టే అని ఆమె చెప్పింది.

Send a Comment

Your email address will not be published.