నాన్నకు ప్రేమతో ...

చాలా కాలానికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా “నాన్నకు ప్రేమతో …”మనముందు ఉంది.
సంక్రాంతి పండుగ కానుకగా వచ్చింది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్ తదితరులు కూడా నటించిన ఈ చిత్రానికి దర్శకులు సుకుమార్. కథ – స్క్రీన్ ప్లే కూడా సుకుమార్ వే. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా బుచ్చిబాబు, శ్రీనివాస్, విక్రమ్ మాటలు రాసారు.

నాన్నకు ప్రేమతో కథలోకి వెళ్తే, ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడతాడు అభిరామ్. అభిరామ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. అతను తనలాగే సమస్యల్లో ఉన్న వాళ్ళతో కలిసి ఒక సంస్థ ప్రారంభిస్తాడు. ఇంతలో అతనికి తన తండ్రి పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్ కు ఆరోగ్యం బాగు లేదని తెలుస్తుంది. తాను ఒకప్పుడు కృష్ణమూర్తి (జగపతి బాబు) అనే వ్యక్తి దగ్గర మోసపోయిన విషయాన్ని తండ్రి చెప్పి అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలన్నదే తన ఆఖరి కోరికగా కొడుకుతో చెప్తాడు. అయితే తన తండ్రి ఆఖరి కోరికను ఎన్టీఆర్ ఎలా తీర్చాడు? అనేదే కథాంశం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చక్కగా ప్రాజెక్ట్ చేయడంలో సుకుమార్ విజయవంతం అయ్యాడు. కథను నేరుగా నడిపించాడు దర్శకుడు.

‘నాన్నకు ప్రేమతో’ అనే మాటతోనే ఈ కథంతా ఎమోషన్స్ తో సాగుతుందని వేరేగా చెప్పక్కరలేదు. అయితే దర్శకుడు ప్రేక్షకుల మెదడుకు పరీక్షపెట్టేలా కూడా కథనాన్ని నడిపించకపోలేదు. కథనంలో పట్టు ఉంది. సుకుమార్ ప్రతిభ దర్శకత్వంలో చక్కగా కనిపించింది.

ఎన్టీఆర్ , జగపతిబాబు నటన గానివ్వండీ, వారి మధ్య సాగిన మాటల పర్వం కానివ్వండీ అంతా ఎంతో బాగుంది. ఫలానా సన్నివేశం వెస్ట్ అని చెప్పడానికి ఏదీ లేదు.

పాటలు ఒహో అని లేవు….సాదాసీదాగా ఉన్నాయి.

రాజేంద్ర ప్రసాద్ తనకిచ్చిన పాత్రకు తగిన న్యాయం చేసారు.

చూస్తున్నంత సేపు బోరు అనిపించకుండా సాగిన చిత్రంగానే నాన్నకు ప్రేమతో అని మాత్రం చెప్తాడు ప్రేక్షకుడు.

Send a Comment

Your email address will not be published.