నా జీవితం మారింది

ఇప్పటి వరకు ఆయనను అందరికీ మర్యాద రామన్న ప్రభాకర్ అనే తెలుసు….ఎందుకంటే ఆ చిత్రంలో అతని పాత్ర ఆ పేరు తెచ్చిపెట్టింది. కాని ఇప్పుడతను కాలకేయ ప్రభాకర్ అయ్యాడు.

ఇటీవల విడుదలయ్యి విజయవంతంగా ఆడుతున్న బాహుబలి చిత్రంలో అతను కాలకేయ పాత్ర పోషించాడు. అందులో అతని పాత్రకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు….

కిలికిల్ అనే ఊహాతీత భాష మాట్లాడుతూ ప్రభాకర్ అందరి మన్ననలు పొందాడు బాహుబలిలో…

బాహుబలి సినిమాలో డైలాగుల కోసం అతను తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మూడు గంటలపాటు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసే వాడు. అందుకు కారణం లేకపోలేదు. అదొక రహస్యం కనుక ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేయకతప్పలేదని అన్నాడు ప్రభాకర్.

నిజానికి సినిమాలో మాట్లాడిన ఆ భాషకు అర్ధముందని, అన్ని మాటలకు భావాలు ఉన్నాయని, ఆ అర్ధాలను దర్శకుడు చెప్తారని అతను చెప్పాడు.

బాహుబలితో తనకో స్థానం దక్కడం ఆనందంగా ఉందని, సికింద్రాబాద్ లోని స్కందగిరి ఆలయానికి తాను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటానని, గతంలో అతి తక్కువ మంది తనను గుర్తించే వారని, అయితే బాహుబలి తర్వాత అభిమానుల సంఖ్య పెరిగిందని చెప్పాడు. ఆలయానికి వెళ్తున్నప్పుడు అంత మంది అభిమానులు చుట్టూ గుమికూడటం చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నాడు. పెద్దవాళ్ళు కూడా కొందరు వచ్చి తనతో ఫోటో తీసుకుంటున్నారని, బాహుబలి చిత్రం తనను స్టేటస్ ని ఎక్కడికో తీసుకుపోయిందని తెలిపాడు.

ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడం భాషా చిత్రాలలో ఆఫర్లు వస్తున్నాయని, కానీ తాను తొందర పడటం లేదని, సినిమాలు ఎంచుకోవడంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నానని, ఒక కన్నడం సినిమాలో నటించడానికి ఒప్పందం చేసుకున్నానని ప్రభాకర్ చెప్పాడు. అలాగే ఓ తమిళం చిత్రానికి సంబంధించి మాటలు సాగుతున్నాయని తెలిపాడు.

బాహుబలికి ముందు బెంగాల్ టైగర్ సినిమాకు డేట్స్ ఇచ్చానని, ఆ తర్వాత మరే తెలుగు సినిమాకి తాను సంతకం చేయలేదని చెప్పాడు.

బాహుబలి చిత్రాన్ని ప్రభాకర్ వాళ్ళ అమ్మగారు ఈమధ్యే చూసారు.

“మా అమ్మగారు మా పల్లెలో ఉంటారు. సినిమా విడుదల అయిన తర్వాత నా నటన గురించి మా అమ్మతో చెప్పగా చెప్పగా అమ్మ ఇప్పుడే ఆ సినిమా చూసింది. మా అమ్మ ఇటీవల ఓ డాక్టర్ ని కలిసినప్పుడు అప్పుడు అక్కడున్న వారెవరో ప్రభాకర్ వాళ్ళ అమ్మ ఈవిడే అని ఆ డాక్టర్ తో అన్నారట. దానితో డాక్టర్ మా అమ్మ దగ్గర ఫీజు కూడా తీసుకోలేదు. పైగా మీ అబ్బాయి ప్రభాకర్ ని నాకు పరిచయం చెయ్యండి అని మా అమ్మతో చెప్పారట…” అని ప్రభాకర్ అన్నాడు.

Send a Comment

Your email address will not be published.