నా జీవిత కల నెరవేరింది!

ప్రముఖ నటి జయప్రద తన జీవిత కల నెరవేరినట్టు చెప్పుకున్నారు. దాదాపు ముప్పై ఏళ్ళు సినీ పరిశ్రమలో ఉంది వివిధ భాషల్లో నటించిన జయప్రద ఇప్పుడు తమిళంలో నిర్మాతగా కొత్త అవతారమెత్తారు. తన సమీప బంధువు సిద్ధూ హీరోగా ఉయిరే ఉయిరే అనే సినిమాను నిర్మిస్తున్నారు జయప్రద.

తనకు జీవిత పాఠాలు నేర్పిన దర్శకుడు కె బాలచందర్ తనకు గురువని అంటూ తమిళంలో తాను కొన్ని చిత్రాల్లోనే నటించినా అక్కడి అభిమానులు తనను బాగానే ఆదరించారని జయప్రద చెప్పారు. చలనచిత్ర పరిశ్రమ తనకు తల్లి లాంటిదని, బేషరతుగా ఈ పరిశ్రమను ప్రేమిస్తానని తెలిపారు.

తన కొడుకులా చెప్పుకునే సిద్ధూని ఎందుకని తమిళంలో పరిచయం చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ తమిళ పరిశ్రమను తన సొంత ప్రపంచంగా భావిస్తానని అన్నారు. ఇక్కడి పరిశ్రమకు విశాలమైన హృదయం ఉందని, తెలుగు, హిందీ భాషల్లో హీరోలు తమ వారసుల్ని రంగంలోకి దింపి వారితో సినిమాలు సమర్పిస్తున్నారని, కానీ తమిళం కొచ్చేసరికి, కమల్ హాసన్ రజనీకాంత్ లకు కొడుకులు లేకపోవడం వల్ల కొంత గ్యాప్ లేకపోలేదని, అందుకే మరో ఆలోచనలేవీ పెట్టుకోకుండా తన కొడుకు సిద్ధుని తమిళ పరిశ్రమలో ప్రవేశపెట్టినట్టు వివరించారు.

సిద్ధూ చేస్తున్న తమిళ సినిమా తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ఇష్క్ సినిమాకు రీమేక్ మాత్రమే. సిద్ధూ సరసన హన్సిక నటించబోతున్నాది. ఈ మేరకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది.

తమిళంలో తానూ చేసిన చివరి చిత్రం దశావతారం అని చెప్తూ త్వరలోనే మరో తమిళ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్పారు. మంచి స్క్రిప్ట్ కోసం గాలిస్తున్నానని జయప్రద అన్నారు.

Send a Comment

Your email address will not be published.