నా మదిలోనిదే దర్శకత్వం

ఇటీవల టాలీవుడ్ లో ఓ వివాద పర్వంలో నుంచి బయటకొచ్చిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా తన మూడవ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పేరు ఉలవచారు బిర్యానీ. ఈ టైటిల్ పెట్టమని సూచించింది ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ అని, ఈ చిత్రానికి సంబంధించి స్క్రీన్ ప్లే, కొన్ని అనుకోని ట్విస్టులు ఆసక్తిగా సాగుతున్నాయని ప్రకాష్ రాజ్ చెప్పారు.
తన దర్శకత్వం గురించి మాట్లాడుతూ తాను పుస్తకాలు విపరీతంగా చదివానని, అలాగే తనకంటూ సొంతంగా ఐడియాలు ఉన్నాయని ఆయన అన్నారు. తాను నటించాల్సిన చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ తన బుర్రలో కొన్ని ఐడియాలు, స్క్రిప్ట్స్, దర్శకత్వానికి సంబంధించిన ఆలోచనలు పని చేస్తూనే ఉంటాయని అన్నారు.
ఈ చిత్రానికి ఆయన భార్య పోనీ వర్మ అసోసియేట్ దర్శకురాలిగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె దర్శకురాలిగా పని చేయాలని ఆశపడుతోందని ప్రకాష్ రాజ్ చెప్పారు. అందుకే ఆమె తనతో కలిసి ఈ చిత్రానికి వర్క్ చేస్తోందని అన్నారు. ఒక విషయాన్ని తెలియజేయడంలో ఆమె తనకంటూ ఒక పంధా కలిగి ఉందని ఆయన అన్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ఆమె కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసిందని వివరించారు.
ఇటీవల తనపై నలిగిన వివాదం గురించి మాట్లాడటానికి ఆయన అంతగా ఇష్టపడలేదు.
తాను ఇప్పటికి మూడు వందల చిత్రాల దాకా వర్క్ చేసేనని, తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతానని, చెప్పాలనుకున్నది దాచి మాట్లాడటం చేతకాదని, ఈ క్రమంలో ఓ పది మందితో సమస్యలు వచ్చాయని అన్నారు. అంటే మిగిలిన 290 మందికి తన వర్క్ నచ్చినట్టే కదా అని ఆయన చెప్పారు.
“నేను ఎలా ఉండాలని అనుకుంటానో అలాగే ఉంటాను. ఇందులో మార్పు ఉండదు. అందరినీ తృప్తి పరచడం కష్టం కదా?” అని ప్రకాష్ రాజ్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.