నా మనసుకు ఏది అనిపిస్తే..

“నేను ఇప్పుడు మేజర్ ని. నేను బ్యాంక్ ఖాతా కలిగి ఉండి అందులో డబ్బులు దాచుకునే స్థాయికి ఎదిగాను” అని మాళవికా నాయర్ చెప్పింది.

Malavika Nairమాళవికా నాయర్ తెలుగులో నటించిన మొదటి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ చిత్రంతో ఆమెకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. ఆమె టాలీవుడ్ లో నటించిన రెండో చిత్రం కళ్యాణ వైభోగమే. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఆమె తన పద్దెనిమిదో పుట్టిన రోజు వేడుకలను కళ్యాణ వైభోగమే సభ్యులతో జరుపుకుంది.

ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ డిల్లీలో ప్రస్తుతం తాను పన్నెండో తరగతి చదువుతున్నానని చెప్పింది. నాకు చదువు చాలా ప్రధానమని, సినిమా కోసం చదువుకి స్వస్తి చెప్పే ప్రసక్తి లేదని, వచ్చే ఏప్రిల్ లో తాను ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయవలసి ఉందని చెప్పారు.

పూర్వం తాను ఏ సినిమా చెయ్యాలి అనే విషయంలో తన తండ్రే ఎంపిక చేసే వారని, ఇప్పుడు తాను కథ బాగుంటే నటించడానికి ఇష్టపడతానని చెప్పింది. తాను స్వయంగా ఎంపిక చేసుకోగలనని చెప్తూ అసలు తాను నటినవుతానని అనుకోలేదని, తన తండ్రి సూచన మేరకే మలయాళంలో నటించినట్టు తెలిపింది. ఆ విధంగా తన కెరీర్ ప్రారంభమైనట్టు వివరించింది.

ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మాళవికకు అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ కథలేవీ ఆమెకు నచ్చలేదు.

“నేను ప్రధానంగా భావించేది చిత్రంలో నా పాత్ర ఎలాంటిది అనేదే. పాత్ర నచ్చకపోతే నటించను. కళ్యాణ వైభోగమే కథ, నా పాత్ర బాగా నచ్చడంతో నేను ఈ సినిమా చేయడానికి సమ్మతించాను” అని మాళవిక చెప్పింది.

కళ్యాణ వైభోగమేలో పాత్ర నీకు అన్ని విధాలా సరిపోతుంది అని దర్శకురాలు నందిని రెడ్డి చెప్పడంతో అందులో నటించానని, తాను ప్రస్తుతం చదువు – సినిమా మధ్య ఉన్నానని, నా చదువు నేను మానుకోనని ఆమె తెలిపింది. అయితే అదే సమయంలో మంచి కథ వస్తే సినిమా కూడా మానుకోనని మాళవిక చెప్పింది.

మాళవికకు పెయింటింగ్ అంటే ప్రాణం. ఏ మాత్రం సమయం దొరికినా పెయింటింగ్ వేసే మాళవిక అభిరుచి తెలుసుకుని దర్శకురాలు నందిని రెడ్డి ఆమెకు రంగు పెన్సిల్స్, ఒక నోట్ బుక్ గిఫ్టుగా ఇచ్చారు.

ఏప్రిల్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ కి వస్తానని ఆమె అన్నారు. తన పద్నాలుగో ఏట చాలా మంది తనను నటించమని కోరినా అప్పట్లో ఎందుకో సినిమా పట్ల మోజు లేకపోయిందని, అయితే ఇప్పుడు నటనపై ఆసక్తి కలిగిందని మాళవిక చెప్పింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయని ఆమె తెలిపింది.

కళ్యాణ వైభోగమేలో తన పాత్ర పేరు దివ్య అని, ఇదొక ప్రేమ కథా చిత్రమని, ప్రేమ సంబంధాలు ఎలాగు ఉంటాయో తెలుసుకోవచ్చని మాళవిక చెప్పింది.

ఈ కొత్త సంవత్సరంలో తన మనసుకు ఏది నచ్చితే అది చెయ్యడానికి నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొంది.

Send a Comment

Your email address will not be published.