నీది నాది ఒకే కథ..ఇది అందరి కథ

కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు మన చుట్టూ జరుగుతున్నట్లే అన్పిస్తాయి. మన జీవితాల్లోని శకలాలనే ఏరి ఎవరో ఎడిట్ చేసి సినిమాగా తీశారా…! అనీ కొన్నిసార్లు అన్పిస్తుంది…అలాంటిదే శుక్రవారం విడుదలైన సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇది మనందరి కథ అంటూ హీరో శ్రీవిష్ణుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం విపరీతంగా ప్రచారం చేసింది. ఓ సినిమాను ప్రచారం చేయడానికి చాలా మంది చాలానే చెబుతారు. చిత్రసీమలో ఇది సాధారణమే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సినిమాకు సంబంధించి అలా కాదు. సినిమా చూసిన వారు నారా రోహిత్, శర్వానంద్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పిన మాటలు నిజమే అనక మానరు. అంతగా ఆకట్టేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇది మన కథ, మన ఎదురింటోడి కథ, మన పక్కింటోడి కథ, అనిపించేలా ఈ సినిమా ఉందని అందరూ అంటున్నారు.

కథలోకి వెళ్తే…
nidi nadi oke kathaచదువంటే అస్సలు సరిపడని ఓ సాధారణ కుర్రాడి కథ ఈ సినిమా. అందులోనూ విద్యను బోధించే ఓ మాస్టారు కొడుకు కథ. చదువులో వెనకబడిన ఆ కుర్రాడు జీవితంలో ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు చెప్పే ఓ సాధారణ కథ. అయితే దానిలో ఎన్నో భావోద్వేగాలు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన ఇంట్లో పరిస్థితులనే తెరపై చూస్తాడు. అదే ఈ సినిమాను విజయంవైపు నడిపిస్తుంది.

విద్యావ్యవస్థల లోపాలు, పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి లాంటి ఓ సున్నితమైన పాయింట్‌ను అందుకొని రూపొందించిన చిత్రమే నీది నాది ఒకే కథ. ర్యాంకులు, మార్కులు రేసులో పరుగెత్తలేని ప్రతీ సగటు విద్యార్థి కథే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్తాం

రుద్రసాగర్ (శ్రీవిష్ణు) అతి సామాన్యమైన సగటు విద్యార్థి. చదువంటే కనీసం ఆసక్తిలేని స్టూడెంట్. ఆటలు, స్నేహితులు తప్ప మరోలోకం లేని యువకుడు. రుద్రసాగర్ తండ్రి (దేవి ప్రసాద్) తన కొడుకును యూనివర్సిటీ ఫస్ట్ వస్తే చూసి ఆనంద పడాలనుకొంటాడు. రుద్రసాగార్ పరిస్థితి చూసిన తర్వాత చివరికి డిగ్రీ పాసైతే సంతోషం అనుకునే పరిస్థితి వస్తుంది. కొడుకు పరిస్థితి చూసి తండ్రి ఆందోళనకు గురవుతాడు. తనకు పరిచయమైన ధార్మిక ( సట్నా టైటస్)‌తో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్‌కు వెళ్లాడు. కానీ అవేమీ తన సమస్యకు పరిష్కారం కాదని గ్రహిస్తాడు. చివరికి తనకు చదువు అబ్బదని, ఇక పరీక్షలు రాయనని తండ్రికి రుద్రసాగర్ చెప్పేస్తాడు.
తన కుమారుడు చదువు ఆపేస్తానని చెప్పిన తర్వాత రుద్రసాగర్, తన తండ్రికి మధ్య చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటి? చదువు మానేసిన రుద్రసాగర్ ఏం చేయాలనుకొన్నాడు? చివరికి తన తల్లిదండ్రులు రుద్రసాగర్ ఏ విధంగా కన్విన్స్ చేశాడు? తాను ప్రేమలో పడిన ధార్మిక‌ను పెళ్లి చేసుకొన్నాడా? జీవితంలో స్థిరపడటానికి ధార్మిక ఎలాంటి తోడ్పాటునందించిందనే ప్రశ్నలకు సమాధానమే నీది నాది ఒకే కథ.

నీది నాది ఒకే కథ ఓ మధ్య తరగతి కుటుంబ కథతో సినిమా ప్రారంభమవుతుంది. రుద్రసాగర్ పరీక్షల రాసే వ్యవహారంతో ఆసక్తికరంగా సినిమా ఆరంభమవుతుంది.

ఇక రెండోభాగంలో తండ్రి దేవి ప్రసాద్, కొడుకు శ్రీ విష్ణు మధ్య జరిగే సంఘర్షణ అద్భుతంగా సాగుతుంది. సమాజంలో తన పరువు ప్రతిష్టల కోసం పోరాడే ఓ తండ్రి, తన అస్థిత్వం జీవితానికి మధ్య సమస్యగా నిలిచిన తండ్రిని కన్విన్స్ చేసే అంశాన్ని దర్శకుడు వేణు ఊడుగుల హ్యాండిల్ చేసిన విధానం సెకండాఫ్‌లో హైలెట్‌గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలతో ఓ అర్ధవంతమైన ముగింపుతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.
ప్రశంసల వెల్లువ

ఇప్పటికే ఈ సినిమాను చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదో మంచి సినిమాగా మిగిలిపోతుందని అంటున్నారు. వేణు ఊడుగులకు దర్శకుడిగా తొలి సినిమానే అయినా తన ప్రతిభతో కట్టిపడేశాడని అంటున్నారు. ఆయన రాసుకున్న డైలాగులు ప్రతి మనసును హత్తుకుంటున్నాయి. కథ, కథనం అన్నీ కొత్తగా అనిపిస్తాయని ప్రేక్షకుల టాక్. సురేష్ బొబ్బిలి ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేదిగా ఉంది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడాల్సిందే అంటున్నారు చూసినవారంతా!

Send a Comment

Your email address will not be published.