నేను ప్రయోగాలు చేయలేదు

పండగ చేస్కో తర్వాత మలినేని గోపీచంద్ టాలీవుడ్ లో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు.

టాలీవుడ్ పరిశ్రమలో సమ్మెతోనే పండగ చేస్కో ప్రేక్షకుల ముందుకు రావడంలో జాప్యం జరిగినట్టు చెప్పారు మలినేని.

డాన్ శ్రీను తర్వాత నేను, రామ్ కలిసి వర్క్ చేయవలసింది…అది కార్యరూపం దాల్చి ఇప్పుడు ఇలా ప్రేక్షకుల ముందుకొచ్చాం అన్నారు మలినేని.

ఈ చిత్రంలో ఎలాంటి ప్రయోగాలకూ ప్రయత్నించక రెగ్యులర్ ఫార్ములా తోనే పండగ చేస్కో సినిమా రూపొందించినట్టు చెప్పిన మలినేని, రామ్ కి మంచి బ్రేక్ అవసరం, అలాగే షాడో సినిమా క్లిక్ కాకపోవడంతో కాస్త డీలా పడ్డ ఈ చిత్ర నిర్మాతకు కూడా మంచి మలుపు అవసరమని అన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పండగ చేస్కో చిత్రాన్ని అంకితభావంతో నడిపించానని తెలిపారు. స్క్రీన్ ప్లే విషయంలో ఎన్నో జాగర్తలు తీసుకున్నానని చెప్పారు.

చాలా మండి దర్శకులు మహాభారతం, రామాయణం, భాగవతం వంటి కావ్యాలను స్పూర్తిగా తీసుకుని తమ చిత్రాలు రూపొందిస్తారని ఒకే లాంటి కథలనే ఎవరికి వారు భిన్నమైన రీతిలో చెప్తారని ఆయన అన్నారు.

తానూ మంచి ప్రేమ కథలు రూపొందించడానికే ఈ పరిశ్రమకు వచ్చినట్టు చెప్తూ వ్యక్తిగతంగా తనకు ప్రేమ విషయాలే ఇష్టమని అన్నారు. ఓకే బంగారం, ఏం మాయ చేసావే వంటి కథలు తనకు ఎంతో ఇష్టమని, ఒక ప్రేమ కథతో తానూ ఎందరో నిర్మాతలను కలిశానని, అయితే వాళ్ళు ఆ కథను మరింత విస్తరించమని అడిగారని, ఈ క్రమంలో ఆ సబ్జెక్ట్ రెగ్యులర్ ఫార్ములాగా వచ్చిందని చెప్పారు.

పండగ చేస్కో సినిమాను సకుటుంబంగా చూడదగ్గ చిత్రంగా తీసానని, అందులో తానూ విజయం సాధించినట్టే ఫీల్ అవుతున్నాను అని మలినేని అన్నారు. తనకు స్ఫూర్తి వీ వీ వినాయక్ అని అంటూ ఆయన రూపొందించే చిత్రాల తీరు తనకెంతో నచ్చుతుందని తెలిపారు.

తన తదుపరి చిత్రం ఓ బిగ్ స్టార్ తో ఉంటుందని, చర్చలు సాగుతున్నాయని, ఆ ప్రాజెక్ట్ కోసం కథ సిద్ధం చేస్తున్నానని, త్వరలోనే ఆ చిత్రం వివరాలు వెల్లడిస్తానని మలినేని గోపీచంద్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.