నేనెక్కువగా అరుస్తాను

“సెట్స్ లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా అరుస్తాను. నేనో భిన్నమైన దర్శకుడిలా మారిపోతాను….” అని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పారు.

భారీ బడ్జెట్ తో రూపొందించిన బాహుబలి చిత్రాన్ని తానే తీసానా అని నమ్మలేకపోతున్నాను అని రాజమౌళి అన్నారు. ఎమోషన్, డ్రామా తనను బాహుబలి చిత్రంలో పని చేయించినట్టు చెప్పారు. అవతార కథలంటే ఆయనకు మహా ఇష్టం. చారిత్రక పౌరాణిక కథనాలంటే తనకెంతో ఇష్టమని, తాను చదివిన మొదటి కథ కృష్ణుడి గురించేనని అన్నారు. బాల భారతి కథలు, రామాయణం, మహాభారతం వంటివి తన బాల్యంలో ఎంతో ఆసక్తితో చదివానని చెప్తూ అందుకే తన పాత్రలన్నీ సూపర్ హీరోలుగా ఉంటారని అన్నారు. ఆనాటి అద్భుతమైన ఆర్ట్ వర్క్ తననెంతో ఆకట్టుకుందని, ముఖ్యమగా శిశువుగా ఉన్న కృష్ణుడిని వసుదేవుడు తన శిరస్సుపై పెట్టుకుని తీసుకు వెళ్ళిన ఘట్టం తనను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు.

టాలీవుడ్ తర్వాత బాలీవుడ్ లో ఖాన్ల చిత్రాలకు దర్శకత్వం వహించాలని ఉందని చెప్తూ తననెప్పుడూ ముందుకు నడిపించేది తన కథే అని అన్నారు రాజమౌళి. తన దగ్గరున్న కథా వస్తువు చాలా బలమైనదని, వారికి అన్ని విధాలా సరిపోతుందని, తన దగ్గరున్న కథ వారికి చెప్తానని, కథ స్టార్లకు నచ్చినట్టు అనిపిస్తే వారిని ముందుగా డేట్స్ అడుగుతానని, ఆ తర్వాత స్టొరీ పై ద్రుష్టి సారించి ముందుకు సాగుతానని అన్నారు. మంచి విలువున్న స్టోరీ సిద్ధం చేసి ఆ తర్వాత వారిని కలుస్తానని అన్నారు. అంతేతప్ప తన టాలీవుడ్ చిత్రాలను పునర్ నిర్మించాలనే ఆలోచన లేదని రాజ్ మౌళి చెప్పారు. ఒకే దానిని మళ్ళీ మళ్ళీ తీయడం తనకు నచ్చదని, ఒక చిత్రం కోసం ఎంత సమయాన్నైనా వెచ్చిస్తానని, అందుకే మరో సినిమా తీసేటప్పుడు కొత్త కథా వస్తువుకే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. తన బాహుబలి చిత్రం కోసం మొదటిసారిగా కరన్ జోహార్ ని కలిసానని, నేను తీయబోయే చిత్రం ఆయనకు తెలుసునని, మా మధ్య ఉన్న వేవ్ లెంగ్త్ బాగా సరిపోయిందని చెప్పారు. ఆ వేవ్ లెంగ్త్ తమను దగ్గర చేసిందని అంటూ కరన్ కోసం సినిమాలు తెస్తానా అనేది కాలమే చెప్పాలని ఆ కోణంలో ఇంకా తాము ఏదీ అనుకోలేదని చెప్పారు.

తన కెరీర్ మాట ఎలా ఉన్నా తానూ తన భార్యకు ముందుగా థాంక్స్ చెప్పుకుంటానని, ఆమె మద్దతు గానీ లేకుంటే భారం పెను భారమయ్యేదని చెప్పారు. ఇంట్లో ప్రతిదీ తానె చూసుకుంటుందని, అందుకే ఇంట్లో తానే బాస్ అని అన్నారు. తన మొదటి చిత్రంలో డిజైనింగ్ కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె చూపించిన శ్రద్ధ తో ఆమెకు రంగుల పట్ల ఉన్న ప్రేమను గుర్తించానని అన్నారు. భిన్నమైన రంగులను ఎలా ఎక్కడ వాడాలన్న ఆమె సెన్స్ నిజంగా అద్భుతమని రాజమౌళి అన్నారు. రంగుల కాంబినేషన్ తనకంతగా తెలీదని, అందుకే తన చిత్రాలకు ఆ విభాగం అంతా ఆమెకు అప్పగిస్తానని చెప్పారు. ఆమెకు కాస్త మొహమాటం ఎక్కువ కనుక ఇంటి నుంచే వర్క్ చేయడానికి ఆమె ఇష్టపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇంటి దగ్గర ఎక్కువసమయం ఉండటం వల్ల పిల్లలను చూసుకునే అవకాశం కూడా ఉంటుందన్నది ఆమె ఉద్దేశమని తెలిపారు. బాహుబలి చిత్రం విషయంలో ఆమెకు ఏవైనా రాయల్టీ ఉంటుందా అని అడగ్గా ఆ సినిమాయే ఆమేదని, ఇక రాయల్టీ అంటూ వేరేగా ఎందుకని రాజమౌళి చెప్పారు.

Send a Comment

Your email address will not be published.