టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలను టీవీ చానల్స్ అన్నీ ప్రముఖంగా ప్రసారం చేసాయి.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి తన స్వరం వినిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును పవన్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడిని దుయ్యబట్టిన సంగతి కూడా తెలిసిందే.
అయితే పవన్ కళ్యాన్ ఎప్పుడు ధ్వజమెత్తినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. దీనితో కొందరు ప్రముఖులకే కాకుండా జనానికీ ఆయన తీరుపై కొన్ని సందేహాలు కలుగుతున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా కోసమే ఉద్యమం చేస్తున్నానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం దానిపై రాజీ పడినట్లుగా కనిపిస్తోందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అన్నారు. అయినా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం మాని… హోదాపై కేంద్రం నుంచి క్లారిటీ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేయడం అర్ధం లేనిదని అన్నారు. కేంద్రమంత్రులు మొదలుకుని చోటామోటా నాయకుల వరకు అటు పార్లమెంట్ లోనూ ఇటు అసెంబ్లీలోనూ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని, డానికి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్టు స్పష్టంగా చెప్తుంటే ప్రత్యేక హోదాపై క్లారిటీ కావాలి అని పవన్ అడగడం అర్ధరహితమని అన్నారు. అసలు పవన్ కే క్లారిటీ లేదేమో అని అనిపించేలా ఆయన మాటలు ఉంటున్నాయని తమ్మారెడ్డి అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా తనవంతుగా స్పందించారు. తమ్మారెడ్డి ముక్కుసూటిగా మాట్లాడతారని పేరుంది. కనుక ఆయన ప్రశ్నలకు పవన్ ఏం చెప్తారు చూడాలి.