పాతవన్నీ బంగారం కాదు

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ పిలుపివ్వడంపై కమల్ ప్రతిస్పందించారు.

మాజీ వైష్ణవైట్ గా, మాజీ శివైట్ గా తాను వీ హెహ్ పీ పిలుపునకు విచారిస్తున్నానని చెప్పారు. పురాణాలపై తగినంత పరిజ్ఞానం లేక పక్క దారి పడుతున్నందుకు బాధ పడుతున్నానని కమల్ చెప్పారు.

తమ కన్నా మెరుగ్గా విషయాలు తెలిసిన అధికశాతం వారిని ఇలాంటి చిన్న చిన్న గ్రూపులు ప్రభావితం చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు.

ఈ చిత్రాన్ని సి బీ ఎఫ్ సి క్లియర్ చేసిన తర్వాత దీనిపై ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో బోధపడటం లేదని కమల్ అన్నారు.

సర్టిఫికేషన్ బోర్డులో బాధ్యతాయుత సభ్యులే ఉన్నారని, వాళ్లకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని చెప్తూ ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ ఇచ్చారంటే అన్ని వయో వర్గాల వారూ ఈ చిత్రాన్ని చూడవచ్చు అనే కదా అర్ధమని ఆయన చెప్పారు. అంతకుముందు విశ్వరూపం సినిమా సమయంలోను కమల్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.

మన మౌలిక హక్కులకు వ్యతిరేకంగా సెన్సార్షిప్ వ్యవహరిస్తోందంటే అది అప్రజాస్వామికమని, అంతకన్నా మరొకటి కాదని కమల్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి పూర్తి ద్వారాలు తెరవని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని అన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ కు మాత్రమే ఉండాలన్నది తన అభిప్రాయమని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ బోర్డు సెన్సార్ బోర్డు లాగా ఎందుకు ప్రవర్తించాలో తెలియడం లేదని అన్నారు . ప్రతీ యాభై ఏళ్ళకు మోరల్స్ పెను స్థాయిలో మారతాయని, అందుకే తాను అంటున్నాను మెరిసేవన్నీ బంగారం కానట్టే పాతవన్నీ బంగారం కాదని ఆయన అన్నారు. కొన్ని కేవలం శిలాజాలే అని చెప్పారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండటం వల్లే తాము ఉత్తమ విలన్ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పిలుపు ఇచ్చామని విశ్వ హిందూ పరిషత్ చెప్పగా కొన్ని ముస్లీం సంస్థలు ఆ పరిషత్ కు మద్దతు తెలిపాయి.

ఇదిలా ఉండగా, తనకిప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ఈ చిత్ర నిర్మాత సి కళ్యాన్ చెప్పారు. కానీ ఈ సినిమా విడుదల చేయకూడదని తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన అన్నారు. అయితే వాటిని తాను సీరియస్ గా పరిగణించడం లేదని, ఈ చిత్రం అనుకున్న ప్రకారం మే ఒకటో తేదీన విడుదల అవుతుందని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.