“పిట్టగోడ” ముచ్చట్లు

Pitta Godaఅనుదీప్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “పిట్టగోడ” ప్రేక్షకుల ముందుంది. ఈ చిత్రానికి కథా మాటలు కూడా ఆయనే సమకూర్చారు. రామ్మోహన్ (స్క్రీన్ ప్లే) నిర్మించిన ఈ చిత్రానికి ప్రాణం కమలాకర్ సంగీతం స్వరపరిచారు.
విశ్వదేవ్ రాచకొండ, పునర్ణవి, జబర్దస్త్ రాజు, ఉయ్యాల జంపాల రాజు, శివ ఆర్.ఎస్, శ్రీకాంత్ ఆర్.ఎన్ తదితరులు నటించారు.

గతంలో అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల వంటి చిత్రాలతో నిర్మించిన రామ్మోహన్ ఇప్పుడు ‘పిట్టగోడ’ అనే సినిమాతో మరి కొంతమందిలోని ప్రతిభను వెలికి తీసుకురావడానికి ప్రయత్నించారు.
టిప్పు అనే పాత్రలో నటించిన విశ్వదేవ్ రాచకొండకు ఇంటర్ పరీక్షలో ఆరు సబ్జెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. అయినా ఏ మాత్రం ఆలోచించకుండా తన మిత్రులతో కలిసి రోజుల్ని గడిపేస్తుంటాడు. ఎంతసేపూ ఓ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండే ఈ గ్రూప్ ని చూస్తే అందరికీ చులకనే.

కాలం సాగిపోతోంది. ఇంతలో వీళ్ళ కాలనీకి దివ్య అనే అమ్మాయి వస్తుంది. దివ్య పాత్రలో పునర్ణవి నటించింది. ఆ అమ్మాయిని చూసీ చూడటంతోనే టిప్పు ప్రేమలో పడతాడు.

దివ్య తండ్రి మరెవరో కాదు. టిప్పు తండ్రికి ఆయన పైఅధికారి. కనుక వాళ్లింట్లో ఏం కావాల్సి వచ్చినా టిప్పు చేసిపెడుతుంటాడు. ఓ మంచి రోజు చూసుకుని టిప్పు తన మనసులోని మాటను చెప్తాడు. అయితే అందుకు దివ్య ఒప్పుకోదు. అయితే కాలక్రమంలో తిప్పులోని మంచితనం గ్రహించి దివ్య తన మిత్రుడిగా ఉండటానికి సమ్మతిస్తుంది. ఇంతలో దివ్య కోసం చేసిన ఓ పనితో టిప్పూ బృందం చిక్కుల్లో పడుతుంది. అయితే టిప్పు చేసిన ఆ పనేమిటో, దాని వల్ల తలెత్తిన చిక్కులు ఏమిటో, టిప్పూ – దివ్య ఒక్కటయ్యేరా లేదా వంటివన్నీ తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాలి.

చిత్రంలో సమయం సందర్భాలను బట్టి సృష్టించిన కామెడీ, కొన్ని అర్థవంతమైన సన్నివేశాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. వినోదం బాగానే పండింది. టిప్పు బృందం పిట్టగోడ ముచ్చట్లు కూడా బాగానే ఉన్నాయి. ముగింపు సహజత్వానికి కాస్త ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల నవ్వులు బాగానే తెప్పిస్తాయి.

హీరో హీరోయిన్లు అయిన విశ్వదేవ్ రాచకొండ, పునర్ణవి తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇద్దరిలో పునర్ణవి నటనను ఒ మెట్టు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. విశ్వదేవ్ రాచకొండ బాడీ లాంగ్వేజ్ చాలా సహజంగా అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా పరవాలేదనిపించే స్థాయిలో నటించారు.

ప్రాణం కమలాకర్ స్వరపరచిన పాటలు వినడానికి వీలుగానే ఉన్నాయి.

దర్శకుడు అనుదీప్ కథను నడిపించిన తీరు బాగానే ఉంది. ఓ మారు చూసి పిట్టగోడ ముచ్చట్లను ఎంజాయ్ చేయొచ్చు….!!

Send a Comment

Your email address will not be published.