పూరీ "లోఫర్"

పూరి జగన్నాధ్ కథ , స్క్రీన్ ప్లే , మాటలతో పాటు దర్శకత్వం వచ్చిన లోఫర్ చిత్రం వరుణ్ తేజ్ , దిశా పటాని, పోసాని కృష్ణమురళి, రేవతి, ముకేష్ రుషి , ఆలీ , బ్రహ్మానందం, ధన్ రాజ్ తదితరుల తారాగణంతో విడుదల అయ్యింది.

లోఫర్ చిత్రానికి నిర్మాతలు: శ్వేత లానా , తేజ, సి.వి.రావు.

గతంలో ఇడియట్, పోకిరి వంటి వాటిని టైటిల్స్ తో సినిమాలు అందించి విజయం సాధించిన పూరీ జగన్నాధ్ ఇప్పుడు తన హీరోని “లోఫర్” గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయం కోసం ఆశిస్తున్నారు. కానీ ఆయన ఆశలపై లోఫర్ నీళ్ళు చల్లడం తధ్యం.

మురళి పాత్రలో నటించిన పోసాని కృష్ణమురళి ఓ లోఫర్ తండ్రి. తన కొడుకుని (రాజా పాత్రలో వరుణ్ తేజ్ నటించారు) చిన్ననాడే తన భార్య దగ్గర్నుంచి తీసుకొచ్చి వాడిని చూపెట్టుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. పైగా కొడుకుతో మీ అమ్మ చచ్చిపోయినట్టు చెప్తాడు. మరోవైపు భార్యతో కొడుకు చచ్చిపోయినట్టు చెప్తాడు. తండ్రీకొడుకులు జోద్ పూర్ లో నివాసముంటారు. కొడుకు దొంగగా నేరాలు చేస్తుంటాడు. తీరా ఓ రోజు తనకు తండ్రి పెళ్లి చెయ్యబోతున్నట్టు పసిగట్టిన కొడుకు ఇంట్లో నించి పారిపోతాడు. ఇంతలో ఆ ఊరుకి మౌని పాత్రలో నటించిన దిశా పటాని వస్తుంది. ఆ అమ్మాయిని వరుణ్ తేజ్ ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ వరుణ్ తేజ్ అంటే దిశా పటాని వాళ్ళ అ త్తకు ఇష్టం ఉండదు. అయితే ఆ అత్త ఎవరో కాదు. వరుణ్ తేజ్ ను కన్న తల్లి. ఈ విషయం వరుణ్ తేజ్ కు తెలుస్తుంది.

ఈలోగా వరుణ్ తేజ్ ప్రేమిస్తున్న అమ్మాయి దిశాను ఆమె సోదరులు ఇంట్లో నించి బలవంతంగా మరో చోటుకి తీసుకుపోతారు.

మరోవైపు, వరుణ్ తేజ్ తనను అసహ్యించుకుంటున్న తల్లికి దగ్గరవడం కోసం ఎత్తులు వేస్తుంటాడు. అంతేకాదు కన్నా తల్లికి ఎలాగోలా దగ్గరైన వరుణ్ తేజ్ తాను ప్రేమించిన దిశాను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే విషయం కోసం వెండితెరమీద చూసి తెలుసుకోవాలి.

ఇప్పటివరకు వచ్చిన తన సినిమాల నుంచే కొన్ని అంశాలను అటూ ఇటూ మార్చి మార్చి లోఫర్ అందించిన పూరీ ఛిత్రం కదా ఎలా ఉంటుందో అని చిత్రం చూడ్డానికి వెళ్తే నిరాశే ఖాయం.
సెంటిమెంట్స్ బలహీనంగా ఉన్న ఈ చిత్రం సాదాసీదాగా సాగి చివరకు శుభం కార్డు వేయించుకుంది.
ప్రేక్షకుల్ని చూడడంతోనే కట్టిపడేసే సన్నివేశాలు ఏవీ లేవు. పోసాని వరకు పరవాలేదు. వరుణ్ తేజ్ నటన ఓ మోస్తరు. దిశా లో గ్లామర్ చూడొచ్చు. అంతకన్నా మరేమీ లేదు. సీనియర్ పాత్రలో నటించిన రేవతి పాత్ర అనుకున్న మేరకు లేదు. ఆలీ కొద్దిగా నవ్విస్తే బ్రహ్మానందం పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు.

సునీల్ కశ్యప్ సంగీతం పరవాలేదు. ఆహా ఓహో అనడానికి వీలులేదు.
చాలా పేలవంగా ఉన్న లోఫర్ కథ చూసే వారి సహనానికి పెద్ద పరీక్షే.

Send a Comment

Your email address will not be published.