ప్రిన్స్ చాలా సింపుల్

ప్రముఖ నటి తులసి ..శంకరాభరణం తులసిగా అందరికీ సుపరిచితురాలే. ఆ చిత్రంలో ఆమె బాల నటిగా నటించారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం యువ నటులకు ఆమె తల్లిగా నటిస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, తదితరులకు ఆమె తల్లిగా నటించడం తెలిసిందే.

మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్రంలోనూ తులసి ప్రముఖ పాత్ర పోషించారు.

శ్రీమంతుడు చిత్రంలో దర్శకుడు కోరట్ల శివ తనకూ ఒక పాత్ర ఇవ్వడం ఆనందంగా ఉందని తులసి చెప్పారు. కోరట్ల శివ ఎప్పుడు స్క్రిప్ట్ రాసినా తనకు ఒక పాత్ర ఇవ్వాలని నిర్ణయించుకోవడం సంతోషమని ఆమె అన్నారు. శ్రీమంతుడు చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని ఎక్సైట్ అవుతున్నానని, అయినా అందులో తన పాత్ర ఏమిటో ఇప్పుడే చెప్పనని తులసి అన్నారు. అయితే ఇటీవల కాలంలో తానూ చేసిన పాత్రలలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు.

మహేష్ బాబుతో పాటు ఆమె కొన్ని సన్నివేశాలలో నటించారు. సెట్స్ లో మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉంటాడని, అతని తండ్రి గారైన కృష్ణ గారి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని, అంతెందుకు తానూ కృష్ణ గారి స్వస్థలానికి కూడా వెళ్లానని, అలాగే మహేష్ బాబు రెండు పుట్టిన రోజులకు హాజరయ్యానని తులసి చెప్పారు. అప్పుడు మహేష్ ఇంకా చిన్న పిల్లాడని, అతనితో నాటి రోజుల గురించి మాట్లాడానని, తాను చెప్తున్న మాటలన్నీ విని మహేష్ పెద్దగా నవ్వాడని, ఆ నవ్వు అందరినీ పడేసిందని తులసి అన్నారు.

గతంలో తులసి జులాయి చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా, డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే కదా…?

అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ తనకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని, తనకు వచ్చే పాత్ర చిన్నదా పెద్దదా అనేది అప్రస్తుతమని, తన క్యారెక్టర్ ప్రధానమైనదిగా ఉంటే చాలు అనుకుని నటించడానికి ఒప్పందం చేసుకుంటానని అన్నారు.

టాలీవుడ్ లో యువతరంతో నటించడం తనకెంతో ఆనందమని, దర్శకులు కోరట్ల శివ, శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్ తదితరుల దర్శకత్వం తనకెంతో ఇస్తామని, వాళ్ళ సినిమాల్లో పల్లెటూరు వాతావరణం చూపించే తీరు బాగుంటుందని తులసి చెప్పారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తననెంతో ఆకట్టుకుందని, అందులో పల్లెటూరు వాతావరణాన్ని ప్రేక్షకుల ముందు సమర్పించిన తీరు అమోఘమని అన్నారు. మహేష్ బాబు తదుపరి చిత్రం బ్రహ్మోత్సవంలో కూడా తనకు నటించే అవకాశం లభించిందని, అందులో కూడా తనది ముఖ్య పాత్రే అని తులసి అన్నారు.

Send a Comment

Your email address will not be published.