ప్రేమ కావ్యం ‘ప్రేమమ్’

premamreviewమలయాళంలో వచ్చిన గొప్ప ప్రేమ కావ్య చిత్రం ప్రేమమ్ ని తెలుగులో పునర్నిర్మించారు.

అక్కినేని నాగచైతన్య, శ్రుతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటించిన తెలుగు చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అల్ఫాన్సో పుతెరిన్ రాసిన కథకు దర్శకుడే స్క్రీన్ ప్లే, మాటలు కూడా సమకూర్చారు.

సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి గోపీసుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం స్వరపరిచారు.

విక్కీ పాత్రలో నటించిన నాగచైతన్య జీవితంలో ముగ్గురు అమ్మాయిలూ మూడు దశల్లో చోటుచేసుకుంటారు. మొదట సుమ పాత్రలో అనుపమ పరమేశ్వరన్, అనంతరం సితార పాత్రలో శ్రుతి హాసన్, ఆ తర్వాత సింధు పాత్రలో మడోన్నా సెబాస్టియన్ విక్కీ జీవితంలో పరిచయమై కథ నడిపిస్తారు. ఈ ముగ్గురు యువతులూ అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించారో తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాలి. మంచి ప్రేమానుభూతిని చవి చూపించిన ‘ప్రేమమ్’ చిత్రంలో ప్రతి ఒక్కరూ ఏదో దశలో ఎవరినో ఒకరిని ప్రేమిస్తారు. వారిలో అప్పుడు పుట్టే ప్రేమ భావం ఏ మేరకైనా ముందుకు తీసుకుపోతుంది. మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. అది అతిశయోక్తి కాదు. అందుకు ప్రతిబింబమే ఈ ‘ప్రేమమ్’ కావ్య చిత్రం.

దర్శకుడు చందూ మొండేటి ప్రేమ కథనాన్ని ఎక్కడా విసుగు రానివ్వకుండా నడిపించడం విశేషం. మలయాళంలో కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అయితే తెలుగులోకి వచ్చేసరికి దర్శకుడు మంచి స్పీడు చూపిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందాడు అందంలో సందేహం లేదు. గొప్ప ఉద్వేగానుభూతికి ప్రతీక అయిన ‘ప్రేమమ్’ చిత్రంలో నాగచైతన్య నటన చాలా బాగుంది. అతని నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఈ చిత్రంతో అతనికి మంచి మార్కులే లభిస్తాయి అని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించ వలసిన పని లేదు. ఆయన ప్రదర్శిన హావభావాలు అమోఘం.
ఇక కథానాయికల విషయానికి వస్తే ముగ్గురూ పోటీ పడి నటించారు.

నర్రా శీను, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా బాగానే నటించారు.

సంగీతానికి కూడా మంచి మార్కులే పడ్డాయి.

మొత్తం మీద చక్కటి ప్రేమ కథా కావ్యం ‘ప్రేమమ్’. హాయిగా చూసి రావచ్చు. తీపి అనుభూతి సొంతం చేసుకోవచ్చు.

Send a Comment

Your email address will not be published.