ప్రేమ లేఖలు చదవడం ఇష్టం

పార్వతి కోసం ఫైట్ లెన్నో చేసిన నూనూగు మీసాల ఈ దేవదాస్ కి ప్రేమలేఖలు చదవడం అంటే బోలెడంత ఇష్టం. ఎవరివో కాదండీ తనకు వచ్చిన ప్రేమలేఖలే. ఫేస్ బుక్, ట్విట్టర్ లు, ఈ మెయిల్స్ కాలంలో కూడా రామ్ కి అమ్మాయిల దగ్గర నుంచి బోలెడన్ని ప్రేమలేఖలు వస్తున్నాయంటే రామ్ కి ఆడ పిల్లల ఫాలోయింగ్ ఎంత ఉందో అర్ధమవుతుంది కదా.. ఈ విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించాడు.

కందిరీగ లాంటి ఈ కుర్రాడిని ప్రేమ తో కుట్టాలని ఎంతో మంది అందమైన అమ్మాయిలు ప్రేమలేఖలు రాస్తున్నారట. మొదటి ప్రేమ లేఖ ఎప్పుడు వచ్చిందో తెలియదు గానీ మొదటి సారి ప్రేమ లేఖ చదివినప్పుడు మాత్రం చాలా థ్రిల్ అయ్యాను. ఒక అమ్మాయి మనల్ని ప్రేమించడం అంటే ఎంత కష్టం. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు. ఎంతో పరిచయం ఉండి రోజూ చూస్తున్న అమ్మాయికి ఐ లవ్ యు చెబితేనే చెంప చెళ్ళు మనిపిస్తున్నారు. అలాంటిది మనల్ని కేవలం సినిమాలో చూసి ప్రేమిస్తున్నామంటూ ప్రేమలేఖలు రాస్తున్నారంటే ఎంతో ఆనందం గా ఉంటుంది. ఆ ఫీలింగ్ ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే నాకు వచ్చే ప్రతి ప్రేమలేఖని ఎంతో ఇష్టం గా చదువుతాను అంటున్నాడు రామ్. ప్రేమలేఖలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు కూడా చెప్పాడు.

స్రవంతి మూవీస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ నేను ఇప్పటి వరుకూ కధని మాత్రమే నమ్ముకున్నాను. నూనూగు మీసాల వయసులోనే ప్రేమ కోసం పార్వతి వెంట బడే దేవదాసుగా నన్ను దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి ప్రేక్షకులకి పరిచయం చేసాడు. మోడరన్ దేవదాస్ గా నన్ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ తర్వాత చేసిన రెడీ, కందిరీగ సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చి నన్ను స్టార్ ని చేసాయి. అయితే ఎంత నమ్మకంతో చేసిన ఒంగోలు గిత్త వంటి మరో రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే నేను ఎప్పుడూ సక్సెస్ ఫార్ములా మీద ఆధార పడి నిర్ణయాలు తీసుకోను. మూస పద్ధతులు ఫాలో కాను. ఎప్పిడికప్పుడు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటాను. అందుకే నా సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. సినిమా కధకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఒకవేళ కధ నచ్చక పోతే ఖాళీగా ఉండటానికే ఇష్టపడతాను తప్ప రాజీ పడి సినిమాలు చేయను.అందుకే నావి ఎక్కువ సినిమాలు రాలేదు. ఈమధ్య కాలంలో నేను సీనియర్ నటుడు వెంకటేష్ తో కలిసి మసాలా సినిమాలో నటించాను. ఆ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీ సినిమా బోల్ బచ్చన్ కి రీమేక్.

ఈ సినిమా లో నాది అభిషేక్ బచ్చన్ పాత్ర. అయితే ఈ క్యారక్టర్ చేయడానికి నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే హిందీ సినిమాలో హీరో ఎంత కామిడీ చేసినా అక్కడ ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే మన టాలీ వుడ్ లో అలా ఉండదు. హీరో అంటే వారికి హీరోయిజం ఉండాల్సిందే. అందుకే మసాలాలో అభిషేక్ పాత్రని మన నేటివిటీ కి తగ్గట్టుగా మార్చాము . మసాలా లో నేను చేసిన క్యారక్టర్ ఇంత వరకూ మన తెలుగు తెర పై ఎవరూ చేయలేదు. ఈ సినిమా లో నా మీద ఒక పాట ఉంటుంది. ఆ పాటకి శివశంకర్ మాస్టారు చాలా సహకరించారు . ఈ సినిమా లో మరో గొప్ప అనుభూతి వెంకటేష్ గారితో పని చేయడం. అంత గొప్ప నటుడి తో కలిసి పని చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అంజలి నాకు అక్కగా చేసింది.

చిన్నప్పటి నుంచీ నాతో కలిసి చదువుకున్న స్నేహితులే నాకు ఎక్కువ. బైటకు ఎక్కడకి వెళ్ళాలన్నా వారితో కలిసే వెళతాను. సినిమా పరిశ్రమలో అందరితో స్నేహంగానే ఉంటాను. అయితే ఇక్కడ పార్టీలకి వెళ్ళాలంటే మాత్రం నాకు చాలా టెన్షన్. అందుకే బైట ఎక్కువగా కనపడను.

Send a Comment

Your email address will not be published.