ఫిదా విజయం సాధిస్తుంది

ఫిదా చిత్రంపై దర్శకుడు శేఖర్ కమ్ముల యెనలేని ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు.

Sekhar Kammula“ఈ చిత్రాన్ని నేను ఇప్పటికే మూడుసార్లు చూసాను…ఇదొక ప్రేమ కథా చిత్రం. ఓ అమెరికా అబ్బాయి, ఓ తెలంగాణా అమ్మాయి మధ్య సాగిన ప్రేమాయణం. ఈ కోణంలో కథను రాసి తెరకెక్కించాలన్న కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. నేను అమెరికాకు చాలాసార్లు వెళ్లాను. అక్కడి ప్రదేశాలతో నాకు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కనుక ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ కథను వెండితెరకు అందించాలని ఎప్పటి నుంచో అనుకున్నాను” అని శేఖర్ కమ్ముల చెప్పారు.

ఇప్పటికే తెలుగు సినీ జగత్తులో కోనసీమ బ్యాక్ డ్రాప్ గా బోలెడు కథలు సాగాయి. కనుక నేను అందులో నుంచి బయటకు వచ్చి తెలంగాణా అమ్మాయి నేపధ్యంలో ఓ సినిమా చేయాలనుకున్నానని ఆయన అన్నారు. అంతెందుకు …ఈ సినిమా చేయడానికి ముందు తాను నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడకు వెళ్లి వచ్చానని, అక్కడి పచ్చదనం, ప్రజలు తననెంతో ఆకట్టుకున్నారని ఆయన చెప్పారు. తన కథకు అన్ని విధాలా సరిపోయే ఓ ఇల్లు కూడా దొరికిందని, అందుకే ఎక్కువ షూటింగ్ అక్కడ చేసినట్టు చెప్పారు. వరుణ్ తేజ్ కు తగిలిన గాయం వల్లే సినిమా ఆలస్యమైనట్టు చెప్తూ లేకుంటే ఈ చిత్రం గత డిసెంబర్ లోనే విడుదల అయ్యేదని అన్నారు. పైగా అతను అప్పట్లో మిస్టర్ సినిమాతో బిజీగా ఉండి అది ఇప్పటికే విడుదల కూడా అయిపోయిందని శేఖర్ కమ్ముల చెప్పారు.

నయనతారతో తీసిన అనామిక చిత్రం ఫ్లాప్ అయినందుకు అప్సెట్ అయ్యేరా అని అడుగగా లేదని ఆయన జవాబిచ్చారు. తానేమీ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదని, అయితే తన మరో చిత్రం లీడర్ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేకపోయినందుకు బాధ పడుతున్నానని అన్నారు. ఆ చిత్ర కథ తెలిసిన వారంతా ఆహా ఓహో అని పొగిడారని, కానీ విడుదల అయిన తర్వాత అంచనాలు తప్పాయని అన్నారు.
ఇలా ఉండగా, ఫిదా కథను ముందుగా శేఖర్ కమ్ముల మహేష్ బాబుకి చెప్పినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ తాను మహేష్ బాబుని కలిసి తన దగ్గర ఓ ప్రేమ కథ ఉందని చెప్పిన మాట వాస్తవమని, కానీ ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని చెప్పారు. ద్వంద్వార్థాలతో సాగే వాణిజ్య సినిమాలకు మనుగడ లేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Send a Comment

Your email address will not be published.