అల్లరి నరేష్ అల్లరే అల్లరి….మరో కొత్త తరహాలో ప్రేక్షకులను నవ్వించడానికి అల్లరి నరేష్ బందిపోటు గా నటించిన చిత్రమే బందిపోటు.
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్నినరేష్, రాజేష్ నిర్మించారు. కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూర్చారు.
అల్లరి నరేష్, ఈశ, సంపూర్నేష్ బాబు, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, చంద్ర మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రం టాగ్ లైన్ ‘దొంగలని దోచుకో’ అని.
నరేష్ పాత్ర వైవిధ్యంతో కూడుకున్నది కాగా సంపూర్నేష్ బాబు ఓ ప్రధాన పాత్రలో నటించారు.
సమాజంలో ఎందరో పేరున్నదొంగలను దోచుకోవడమే అల్లరి నరేష్ వంతు. అతని గురించి హీరోయిన్ ఈశ తెలుసుకుంటుంది. ఒకానొక రోజు ఆమె నరేష్ ని కలిసి తమ కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు చెప్పి ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించిన తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళిలను మోసగించి వారి నుంచి డబ్బు దోచుకోమని చెప్తుంది. ఈ క్రమంలో ఆమె పూర్వ కథ తెలుసుకుని నరేష్ ఆమె కోరికను తీర్చడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ ముగ్గురినీ ఏ విధంగా ఎంత దోచుకున్నాడు అన్నదే ఈ సినిమా కథనం. అయితే అతనికి ఎవరు సహకరించారు? ఈశ పూర్వ వివరాలు ఏమిటి ? వంటి విషయాలు తెలుసుకోవాలంటే బందిపోటు చిత్రం చూడాలి.
అల్లరి నరేష్ నటన బాగుంది. ఈసారి అతని ప్రతిభలో భిన్నమైన నరేష్ ని చూసాం అన్నదే చూసిన వారి టాక్. ఈ సినిమాలో ప్రధాన కథంతా అతని మీదే సాగింది. అతని సరసన కథానాయిక ఈశ కూడా చక్కగానే నటించింది. ఆమె గ్లామర్ బాగుంది. పాటలలో అల్లరి నరేష్, ఈశలను అందంగానే ప్రేక్షకుల ముందు ఉంచారు. కళ్యాణ్ కోడూరి స్వరాలూ బాగున్నాయి.