పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంలో నటించిన ఆదా ఆ తర్వాత బన్నీతో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నటించారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఆమె అమాయకమైన పాత్రలో నటించింది.
ఈ రెండు చిత్రాల్లో తనకిచ్చిన పాత్రలు మరీ పెద్ద పాత్రలు కాకపోయినా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారని ఆదా చెప్పారు. ‘సన్నాఫ్ సత్య మూర్తి’ హిట్ అవడం ఆనందంగా ఉందని, ఈ చిత్రంలో తన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఆ పాత్రను దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీర్చిదిద్దిన తీరు అమోఘమని ఆమె అన్నారు.
బన్నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, ముఖ్యంగా అతను డాన్స్‌లు అద్భుతమని ఆదా ప్రశంసించారు. బన్నీతో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని, తన ఫేవరిట్ నటి సమంతతో కలిసి ఈ సినిమాలో పాలుపంచుకోవడం హ్యాపీ గా ఉందని ఆమె అన్నారు. రెండో సినిమాలోను బన్నీ తో కలిసి నటించే అవకాశం రావడం తన భాగ్యమని ఆమె చెప్పారు.
హీరోయిన్లకు తగిన ప్రాదాన్యతలున్న పాత్రలు దొరకడం కష్టంగానే ఉందని, దానితో గ్లామర్‌కే పరిమితం కావలసి వస్తోందని అన్నారు.
తనకెంతో నచ్చిన సినిమా ‘టైటానిక్’ అని, ఈ సినిమాను చూసి ఎంతగానో ఫీలయ్యానని, ఆ చిత్రంలోని హీరోయిన్ లాంటి పాత్ర చేయాలని ఉందని ఆమె అన్నారు. తనకు అదొక డ్రీం రోల్ అని ఆదా చెప్పుకున్నారు.
ప్రస్తుతం తాను తెలుగులో రెండు ప్రాజెక్టులు చేస్తున్నానని, అలాగే కన్నడ, హిందీ భాషల్లోనూ ఒక్కో సినిమాలో నటిస్తున్నానని, తమిళంలో ఒక సినిమాకి సంబంధించి మాటలు జరుగుతున్నాయని, ఇంకా ఖరారు కాలేదని ఆదా చెప్పారు.