‘బాబు బంగారం’ కాదు

హీరో విక్టరీ వెంకటేష్. దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే “బాబు బంగారం”. వెంకటేష్ తో పాటు నయనతార, సంపత్, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్, పృథ్వీ, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం స్వరపరిచారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ఏసీపీ కృష్ణ పాత్రలో నటించిన వెంకటేష్ ఈ చిత్రంలో ఎంతో కరుణ గల హృదయుడు. తప్పు చేసిన వారిని చిత్తమొచ్చినట్టు బాది తర్వాత వాళ్లకు చికిత్స చేసి విడిచిపెట్టే తత్త్వం అతనిది. అతను తనలాగా జాలి గల అమ్మాయినే చూసి మరీ ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి పాత్రలో నటించింది నయనతార. ఆమె పాత్ర పేరు శైలజ. ఆమెకు వెంకటేష్ తానూ ఒక ఎన్నారైగా చెప్పుకుని చేరువవుతాడు. అయితే ఆమె తండ్రి ఒక హత్య కేసులో ఇరుక్కుని తప్పించుకుని తిరుగుతుంటాడు. తన తండ్రి కోసం కొందరు రౌడీలు వెంటపడటం శైలజకు తెలుస్తుంది. ఆ రౌడీలకు మల్లేష్ యాదవ్ నాయకుడు. ఈ మల్లేష్ పాత్రలో సంపత్ నటించాడు. ఇంతలో తన తండ్రిని పట్టుకోవడానికే కృష్ణ తన వెంట పడ్డాడని శైలజకు అనుమానం వస్తుంది. మరి కృష్ణ పధకం, శైలజ తండ్రి నేరస్థుడా కాదా, రౌడీల మూలాలు కృష్ణ తెలుసుకుని ఏం చేసాడు వంటి వివరాలు తెలుసుకోవాలంటే బాబు బంగారం చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ఈ మధ్య కొన్ని పాత కథలనే ఎంచుకుని వాటి రూపు మార్చి కొత్తగా సినిమాలు తీయడం సర్వసాధారణమైపోయింది. లేదా నాలుగైదు సినిమాలు తీసుకుని అందులో కొంత ఇందులో కొంత తీసుకుని వాటిని అటూ ఇటూ తిప్పి సినిమా నిర్మించడమూ జరుగుతోంది. బాబుబంగారం కూడా దాదాపుగా అలాంటి కోవలోకే వస్తుంది. ఒకప్పుడు నిర్ణయం పేరిట వచ్చిన చిత్ర కథనే తీసుకుని కొత్త తరహా వన్నెలు అద్ది సమర్పించిన చిత్రమే బాబు బంగారం. సాదాసీదాగా ఉన్న ఈ చిత్రంలో పృథ్వీ, పోసాని కృష్ణమురళి ఓ మోస్తరు నవ్వులు పండించారు.

రచన కూడా యావరేజ్ గా ఉంది. దర్శకత్వం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయింది. చాలా సన్నివేశాలు నీరసంగా ఉన్నాయి. హీరో పాత్రను మరింత చక్కగా ఘనంగా చిత్రీకరించాల్సింది. తనవరకు వెంకటేష్ పరవాలేదనిపించాడు. నయనతార పాత్ర గొప్పగా లేదు. సంపత్, జయప్రకాష్ నటన నయం.

జిబ్రాన్ సంగీతం బాగున్నా ఓహో అనిపించేట్టు లేవు పాటలు. వెన్నెల వానలా.. బాబు బంగారం పాటలు కొద్దిగా మెరుగు.

మొత్తంమీద సినిమాను పండించలేకపోయాడు మారుతి అనే మాటైతే మిగిల్చుకున్నాడు.

Send a Comment

Your email address will not be published.