బాలకృష్ణ తదుపరి చిత్రం

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం విజయవంతమైన కొన్ని రోజులకే ఇప్పుడు మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. బాలకృష్ణ హీరోగా నటించే ఈ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు, హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు స్టుడియోలో జరిగాయి. ఈ చిత్రానికి సత్య దేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపతి రమణా రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిజానికి ఈ చిత్రం ఈ నెల పదో తేదీన ప్రారంభం కావలసింది. అయితే దీనికి రెండు రోజుల ముందు అంటే  ఈ నెల ఎనిమిదవ తేదీన బాలకృష్ణ శాసన సభ్యుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా ఆయన పోటీ చేసి గెలిచిన హిందూపురం నియోజక వర్గానికి వెళ్ళవలసి ఉండటంతో ఈ చిత్ర ప్రారంభాన్ని అడ్వాన్స్ చేసినట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి.
దర్శకుడు సత్య దేవ మాట్లాడుతూ మూడేళ్ళ క్రితం ఈ చిత్ర కథను రాసానని, బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసానని చెప్పారు. ఈ చిత్రం చెయ్యడానికి బాలకృష్ణ అంగీకారం కోసం ఇంతకాలం నిరీక్షించినట్టు చెప్పారు. మరెవ్వరికీ ఈ కథ చెప్పలేదని, ఒక్క బాలకృష్ణకు మాత్రమే తెలిపానని దర్శకుడు అన్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ భిన్నమైన క్యారక్టర్ లో కనిపిస్తారు. ఆయనకు జోడీగా త్రిష నటిస్తున్నారు.
మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.