బాలీవుడ్ తార నందా ఇక లేరు

సుప్రసిద్ధ తార నందా మార్చి 25వ తేదీన ముంబైలోని అన్దేరిలో ఉన్న తమ స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 75 ఏళ్ళు.
1960లలో జబ్ జబ్ ఫూల్ ఖిలే, గుమ్నం, తీన్  దేవియన్. ది ట్రైన్ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను కలిగిన నందా అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు తమకెవరికీ తెలియదని, ఆమె మరణించారన్న దుర్వార్త తమను శోకసముద్రంలో ముంచివేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
1939 జనవరి 8వ తేదీన పుట్టిన నందా తండ్రి మాస్టర్ వినాయక్ దామోదర్ మరాఠి ఫిలిం మేకర్. ఆమె తల్లి పేరు మీనాక్షి. ఆమె ఎనిమిదో ఏట తండ్రిని కోల్పోయారు.
ఆమె తన అయిదవ ఏట నట జీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వీ శాంతారాం బంధువైన నందాకు బాగా పేరు తెచ్చిన చిత్రం  1956 లో ఆమె నటించి విడుదలైన తూఫాన్ ఔర్ దియా.
కాలా బజార్ వంటి చిత్రాల్లో ఆమె సపోర్టింగ్ క్యారక్టర్ పాత్రల్లో నటించి ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
ఆమెను చోటి బహెన్ అనే నిక్ నేంతో పిలిచే వారు.ఆమె ఎక్కువగా ఈ పాత్రకే పరిమితమై నటించినా కొన్ని రొమాంటిక్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించకపోలేదు.  హమ్ దోనో, గుమ్నం తదితర చిత్రాల్లో ఆమె నటనను అన్ని వర్గాలవారు కొనియాడారు. అందరూ గుర్తుంచుకునే నటనను ప్రదర్శించారు.
రాజ్ కపూర్, మనోజ్ కుమార్, రాజేంద్రకుమార్, దేవ్ ఆనంద్, రాజేష్ ఖన్నా, శశి కపూర్ తదితర ప్రముఖ హీరోలతో కలిసి నటించిన ఆమె ఆతర్వాత తల్లి పాత్రలోనూ నటించారు.
ఆమె నటించిన తొలి చిత్రం మందిర్ కాగా ఆఖరి చిత్రం ప్రేమ రోగ్.
ఆమె పెళ్లి చేసుకోలేదు. కానీ ఫిలిం మేకర్ మన్మోహన్ దేశాయ్ (అమర్ అక్బర్ అన్తోనీ) తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
నందాది సహజ మరణమే అని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఆమె చనిపోయిన  విషయం తెలియరావడంతోనే ఆమె నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.
ఆమె ఇక లేరు అని తెలిసిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది మాత్రమే  ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించినట్టు పోలీసు వర్గాలు చెప్పాయి.
ఆమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
తండ్రి పోయినప్పటి నుంచి కుటుంబమంతా ఆమె సంపాదనపైనే ఆదారపడవలసివచ్చింది. అందుకోసమే ఆమె సినిమాల్లో తొలి రోజుల్లో బేబీ నందగా అనేక చిత్రాల్లో నటించారు.

Send a Comment

Your email address will not be published.