ఓ సగటు సినిమా చూడటానికి అలవాటు పడే వారు సైతం ఎందుకురా ఈ సినిమా చూడటానికి వచ్చాం అన్నంత చప్పగా చెత్తగా ఉంది బ్రూస్లీ. ఎన్నో అంచనాలతో ఈ సినిమా చూసేందుకు వెళ్ళే వారిని నిలువునా నీరసపరచిన చిత్రం బ్రూస్లీ. ఈ సినిమాలో నటించిన వారి పేర్లు సినిమాను కాపాడితే కాపాడాలి తప్ప ఏ మాత్రం రంజుగా లేని చిత్రం బ్రూస్లీ. శ్రీను వైట్ల దర్శకత్వం పరమ బోరింగ్ గా అనిపించింది.
రామ్ చరణ్, రకుల్ ప్రీత్, కృతి కర్బందా, అరుణ్ విజయ్ తదితరులు నటించిన బ్రూస్లీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం స్వరపరిచారు. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల. ఏ మాత్రం కొత్తదనం చూపలేకపోయారు శ్రీను వైట్ల. రచయితలు గోపి మోహన్, కోన వెంకట్. వీరితో దర్శకుడు పూర్తిగా రాజీపడినట్టు సినిమా చూస్తే అనిపిస్తుంది.
కుటుంబ కథా చిత్రంగా చెప్పుకుంటూ బ్రూస్లీ అనే టైటిల్ పెట్టడంతోనే సినిమా పై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. బ్రూస్లీ అనే టైటిల్ ఉండటంతో ఇదేదో యాక్షన్ సినిమా అనుకుని చూడటానికి వెళ్తే వాళ్ళు తల బొప్పి కట్టి వెనక్కు రావాల్సిందే.
కార్తీక్ అలియాస్ బ్రూస్లీ పాత్రలో రామ్ చరణ్ నటించారు. అతను ఒక స్టంట్‌మ్యాన్. అక్కన పాత్రలో నటించిన కృతిని కలెక్టర్‌ని చేయాలనే తండ్రి ఆశయానికి ఆయనకు తెలియకుండానే సాయపడుతూ ఉంటారు బ్రూస్లీ. ఆమెకు జయరాజ్ పాత్రలో నటించిన సంపత్‌రాజ్ కుటుంబం నుంచి ఓ సంబంధం వస్తుంది. కానీ జయరాజ్ వెనుక గతం మరొకటి. అయినప్పటికీ తన అక్క వెళ్లే మెట్టినిల్లు ఇల్లు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని బ్రూస్లీ అనుకుంటాడు. ఈ క్రమంలో తమ్ముడు ఎలా నిలబడ్డాడు అనే రీతిలో నడిపించిన కథనం చాలా పేలవంగా సాగి చూసే వారికి తలనొప్పి తెప్పిస్తుంది. ఇంత చెత్త సినిమాకి కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అనిపించేలా ఉంది చిత్రం. చివరికి కామెడీ కూడా చెత్తే.
అయితే చరణ్ నటుడిగా మెరుగుపడటం మరచిపోకూడదు. అతని సరసన నటించిన రకుల్ తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. నదియా విషయానికి వస్తే అది ఆమె చెయ్యవలసిన పాత్ర కాదని అనిపిస్తుంది. బ్రహ్మానందం రొటీన్ పాత్ర జయప్రకాష్‌రెడ్డి పరవాలేదు. రావు రమేష్ కాస్త నయం.
ఇదిలా ఉండగా ఈ చిత్రం మీద రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై నెగటివ్ కామెంట్ చేస్తూ సినిమా బాగులేదని నేరుగా చెప్పకుండా బ్రూస్ లీ సినిమా చూశాక అర్జెంటుగా తాను బ్రూస్ లీ హీరోగా నటించిన ‘ఎంటర్ ద డ్రాగన్’ సినిమా చూస్తున్నానని వర్మ చెప్పారు. “మన ‘బ్రూస్ లీ’ సినిమా చూస్తే బ్రూస్ లీ ఫీలింగ్ ఎలా ఉండేదో అంటూ ఆ లెజెండ్ వికారంగా చూస్తున్న పిక్ ఒకటి పెట్టాడు. తాను ఆగ్ సినిమా తీసినపుడు రమేష్ సిప్పీ ఫీలింగ్ కూడా ఇలాగే ఉండేదనడం ద్వారా” ‘బ్రూస్ లీ’ మీద తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండానే చెప్పారు వర్మ. ఇటువంటి సినిమాను మెగాస్టార్ చిరంజీవి తన పునరాగమనానికి ఉపయోగించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఎలాంటి తప్పిదమో.. చిరంజీవి తన 150వ సినిమాగా ‘బ్రూస్ లీ’ని ఎంచుకోవడం కూడా అంతే తప్పన్నారు వర్మ. .
చిరంజీవి ‘కత్తి’ని రీమేక్‌లో నటించబోతున్నారని వచ్చిన వార్తలకు స్పందిస్తూ తమిళ సినిమాను కాపీ చేసి తెలుగు ప్రతిష్టను మంటగలపవద్దని.. ఓ ఒరిజినల్ తెలుగు కథతోనే చిరంజీవి సినిమా చేయాలని వర్మ మెగాస్టార్ కు సూచించారు. .