అనుష్కకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాగా ‘భాగమతి’ ని చెప్పుకోవచ్చు అనే స్థాయిలో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ‘భాగమతి’ ట్రైలర్ చూడగానే ఇదో హార్రర్, థ్రిల్లర్ చిత్రం అనిపిస్తుంది. ‘భాగమతి’ చిత్రం ప్రథమార్థం చూస్తున్నంతసేపూ ఇది భయపెట్టడంతోపాటు ఉత్కంఠ రేకెత్తిస్తూనే ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో ఇందుకు భిన్నంగా కథనం సాగుతుంది.
జి.అశోక్ దర్శకత్వంలో అనుష్కతోపాటు ఉన్ని ముకుందన్, జయరాం, మురళీ శర్మ, ప్రభాస్ శీను, ధన్ రాజ్ తదితరులు నటించిన చిత్రమే ‘భాగమతి’.
ఈ చిత్రానికి సంగీతం తమన్. వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా దర్శకుడే సమకూర్చారు.
కథలోకెళ్తే…
చంచల పాత్రలో అనుష్క నటించింది. ఆమె ఓ ఐఏఎస్ అధికారిణి. ఆమె తనకు కావలసిన భర్తకు సంబంధించిన హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. కానీ చంచల గతంలో ఓ మంత్రి దగ్గర పీఏగా పని చేస్తుంది. ఆ మంత్రి అవినీతికి సంబంధించిన వివరాలు రాబట్టడానికి సీబీఐ అధికారులు చంచలను ప్రశ్నించాలనుకుంటారు. ఈ వివరాల సేకరణ కోసం చంచలను జైలు నుంచి అటవీ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ భవంతికి తరలిస్తారు. అయితే అక్కడ అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి.
భాగమతి భవంతిగా పేరున్న ఆ భవనం వెనుకున్న కథ ఏంటీ.. చంచల ఎందుకు హత్య చేసింది…ఆమె కేసు నుంచి బయటపడటం వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండితెరపై చూడాలి.
అనుష్కకు ఈ చిత్రం ఓ ప్రత్యేక సినిమానే. అందులో అనుమానం లేదు. ఆమె బీభత్సంగా నటించి ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. ఇక మలయాళ నటుడు జయరాం తన పాత్రకు అన్ని విధాల న్యాయం చేశాడు. మురళీ శర్మ తన పాత్రకు వన్నె తెచ్చారు. మిగతా నటీనటుల నటన పరవాలేదు.
‘భాగమతి’కి ప్లస్ పాయింట్ అల్లా నిర్మాణ విలువలు, సాంకేతికపరంగా చేసిన హంగామా. సినిమాటోగ్రాఫర్ పనితనం కొన్నిసన్నివేశాలలో బాగా కనిపిస్తుంది. దర్శకుడి ప్రతిభ కూడా ఓ.కే.
చూడదగ్గ చిత్రమే ‘భాగమతి’ .