భాగమతీతో అనుష్క శెట్టి

Bhagmatiదిగ్విజయం అందించిన బాహుబలితో ప్రేక్షకులకు మరింత చేరువైన అనుష్క శెట్టి ఇప్పుడు భాగమతీతో రాబోతోంది. ఇదేదో దయ్యం కథ అని కొందరనుకుంటున్నారని, కానీ కాదని అనుష్క చెప్పింది. ఇదొక థ్రిల్లర్ చిత్రమని ఆమె స్పష్టం చేసంది.

భాగమతిలో అనుష్క పోషిస్తున్న పాత్ర ఓ ఐఎఎస్ అధికారి పాత్ర. ఆ పాత్ర పేరు సంజన. ఇప్పటి వరకూ తాను చేసిన పాత్రలన్నింటిలో ఇది ఎంతో భిన్నమైనదని, ఆలోచింప చేస్తుందని ఆమె తెలిపింది. ఇంతటి ఘనమైన పాత్ర ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఆయన ఈ పాత్ర తనకివ్వడం కోసం స్క్రిప్ట్ తోపాటు 2012 నుంచి నిరీక్షిస్తున్నారని ఆమె చెప్పింది.

తాను ద్విపాత్రాభినయం చేయడం లేదని, కానీ ఈ పాత్ర బహుముఖాలతో కూడినదని పేర్కొంది. కథ ఎంత మంచిదైనా దాన్ని వెండితెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ ప్రధానమని ఆమె తెలిపింది.

తాను చలనచిత్ర రంగంలోకి వచ్చినప్పుడు కథల గురించి పెద్దగా పట్టించుకునే దాన్ని కానని, అయితే పూరీ జగన్నాథ్ గారు ఓసారి తనతో మాట్లాడుతూ నువ్వు నటించబోయే చిత్రం తాలూకూ కథ ఏమిటన్నది తెలుసుకోవాలనే కుతూహలం ఉండదా అని ప్రశ్నించినప్పుడు ఆయన ఎందుకు అలా చెప్పారా అని తాను ఆలోచంచడం మొదలుపెట్టానని అనుష్క చెప్పింది. కథ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలని చెప్పింది ఆయనే అని ఆమె గుర్తు చేశారు.

బాహుబలి చిత్రంతో తనకు జాతీయ అవార్డు రానందుకు బాధ పడుతున్నారా అని అడగ్గా, తానేమీ జాతీయ అవార్డుల గురించి ఆలోచించడం లేదని, భారత ప్రజానీకం నుంచి మెచ్చుకోలొస్తే అదే పెద్ద అవార్డని అనుష్క స్పందించింది.

పత్రికలపట్ల అంతగా ఆసక్తి చూపని అనుష్క సామాజిక మాధ్యమాలలోనూ ఆమె పెద్దగా ఇష్టం చూపడం లేదు. తాను ఒత్తిడికి దూరంగా ఉండాలనుకుంటానని, అందుకే పొద్దున్నే పత్రికలు చూసి ఒత్తిడికి లోనవడం కన్నా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం ఉత్తమమని ఆమె అభిప్రాయపడింది. తానెవరినీ తనకు పోటీదారుగా భావించనని, ఎవరి నటన వారిదే అని ఆమె కచ్చితంగా చెప్పింది.

తాను గూటి పక్షినేనని, షూటింగులు లేనప్పుడు తాను ఇంటి పట్టునే ఉండడానికి ఇష్టపడతానని, ఆ సమయంలో ఏ పనీ చేయక హాయిగా రిలాక్స్ అవడానికే ఇష్టపడతానని చెప్పింది. తనకు మిత్రుల బలగం ఎక్కువేనని, వారందరినీ తాను కుటుంబసభ్యులగానే భావిస్తానని, అక్కినేని, చిరంజీవి కుటుంబాలతో తనకు మంచి అనుబంధమే ఉందని అనుష్క తెలిపింది.

దగ్గుబాటి రానా చిత్రపరిశ్రమకు రాకముందు నుంచే తనకు తెలుసునని, తనకు యోగా క్లాస్ వల్ల ఎందరో మిత్రులయ్యారని అనుష్క చెప్పింది. ఒకవేళ రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ప్రచారం చేస్తారా అని అడగ్గా రజనీ సార్ అటువంటి వాటికి తనను పిలవరని పైగా తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని కూడా చెప్పింది. ప్రభాస్ తో పెళ్ళి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ తామిద్దరం మంచి మిత్రులమని, అంతేతప్ప అంతకు మించి తమ మధ్య మరేమీ లేదని, తమ మధ్య పెళ్ళి జరిగే అవకాశమే లేదని అనుష్క కచ్చితంగా చెప్పింది.

Send a Comment

Your email address will not be published.