భాషపై పట్టు ఉండాలి

టాలీవుడ్  లో ఇప్పుడు నలుగురి  నోటా  నానుతున్న  పేరు  కృష్ణకాంత్ . ఈయన గీత  రచయిత. ఇటీవలే  విడుదలై విజయవంతంగా  ఆడుతున్న  “కృష్ణ  గాడి  వీర  ప్రేమ గాధ”   చిత్రంలో  అన్ని పాటలూ  రాసిన  రచయిత  కృష్ణకాంత్ కావడం  విశేషం.

“స్కూల్ లో చదువుకుంటున్న  రోజుల్లోనే పాటల  రచయిత కావాలని అనుకున్నాను. ఇంటర్ లో  సంస్కృతం  చదివాను ”   అని  కృష్ణకాంత్ చెప్పారు.

మంచి పాటల  రచయిత  కావాలంటే భాష మీద  పట్టు ఉండాలన్నది  కృష్ణకాంత్ అభిప్రాయం.

నల్లగొండ  జిల్లాలోని  సూర్యాపేటకు  చెందిన కృష్ణకాంత్  హైదరాబాదులో ఇరవై సంవత్సరాలుగా  ఉంటున్నారు.

గ్రాఫిక్ డిజైనింగ్  పట్ల  ఆసక్తి ఉన్న  కృష్ణకాంత్  కొన్ని  చానల్స్  లో ఆ  దిశలో పని కూడా చేసిన  అనుభవం గడించారు.

ఆయనకు మొదటిసారిగా  అందాల రాక్షషి చిత్రంలో అవకాశం ఇచ్చినది దర్శకుడు  హను రాఘవపూడి.

ఆయనే మళ్ళీ  కృష్ణ  గాడి వీర ప్రేమగాధలో అవకాశం ఇచ్చారని  చెప్తూ  ఈ మధ్యలో దోచేయి, అసుర, కుమారి 21  ఎఫ్ , భలే  మంచి రోజులు తదితర  చిత్రాలకు  పాటలు రాసినన్నారు కృష్ణకాంత్.

తెలుగు సాహిత్యంలో  విరివిగా  పుస్తకాలు చదివే కృష్ణకాంత్ కు ఇష్టమైన  రచయితలు చలం, శ్రీ శ్రీ  తదితరులు. ఇక  సినీపరిశ్రమలో ఆయన  అభిమానించే  రచయితలలో వేటూరి  ముందున్నారు.  తాను రాసే పాటలలో ఇంగ్లీష్ పదాలు రానివ్వకుండా  చూస్తానని, చాలా తేలికైన తెలుగు మాటలే  వాడుతానని,  ఎక్కువగా    మెలోడీస్ రాస్తానని  చెప్పారు.

ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో  కొత్తదనానికి  చాలా  చోటు ఉందని,  దర్శకులు ఎక్కువ  మంది  నవ్యతకు  వీలు కల్పిస్తున్నారని  కృష్ణకాంత్  చెప్పారు.  ఇది  గేయరచయితలకు  ప్రోత్సాహకరమైందని,  తాను ఇప్పటివరకు  రాసిన  పాటలకు దర్శకులు చాలా స్వేచ్చ ఇచ్చారని అన్నారు. వాళ్ళు ఎప్పుడూ  అలా రాయాలని ఇలా రాయాలని  బలవంతం  చేయలేదని  అంటూ వాళ్ళు కథ  చెప్పిన  తర్వాత  సందర్భానికి  తగ్గట్టు  ఆలోచించి తాను  పాట  రాస్తానని  చెప్పారు. ఓ పాట రాయడానికి  కొన్ని  గంటలు తీసుకుంటానని  అన్నారు.

ఏదో ఒకరోజు  తాను కూడా అందరు  చెప్పుకునేలా ఓ మంచి  పాటల రచయితగా టాలీవుడ్  లో నిలుస్తానన్న  నమ్మకం ఉందని కృష్ణకాంత  ధీమా  వ్యక్తం  చేసారు.

Send a Comment

Your email address will not be published.