మనందరి కోసం "మనం"

మానవ అనుబంధాల ప్రాధాన్యాన్ని ఆవిష్కరించిన “మనం” మనముందుకు మే నెల 23వ తేదీన విడుదల అయ్యింది. అనుబంధాల కథ కాబట్టే మనం అనే  టైటిల్ ఈ చిత్రానికి అచ్చంగా సరిపోయింది. ఒక తప్పు చేసిన ప్రకృతి ఆ తప్పును ఏ విధంగా సరిదిద్దుకున్నదన్న విషయాన్ని “మనం” ద్వారా తెలుసుకోవచ్చు.

1920 నుంచి 2013 వరకు మూడు అధ్యాయాలుగా సాగిన కథ ఇది. అందుకే అక్కినేని వంశపు మూడు తరాల వారు ఇందులో కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య ఈ చిత్రంలో నటించారు. అక్కినేని నాగేశ్వర రావు గారు నటించిన ఆఖరి చిత్రం ఇది. భార్యా భర్తలు, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే అంశాలను ఇందులో చూడవచ్చు.

లెక్కలు వేసుకోకుండా ఎంతో నమ్మకంతో నాగార్జున నిర్మించిన ఈ చిత్ర కథ గమ్మత్తైనది. లోతైనది. అందులో మ్యాజిక్ ఉంది. అక్కినేని వంశానికి చెందిన ముగ్గురి  పాత్రలూ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ప్రత్యేకించి అక్కినేని నాగేశ్వర రావు, నాగచైతన్యల మధ్య పోట్లాట తప్పక అలరిస్తుంది. వీరి మధ్య అక్కినేని నాగార్జున ఒక వారధిగా కనిపిస్తారు.

తమ తండ్రికి ఇది ఆఖరి చిత్రమవుతుందని ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు తామెవరమూ ఊహించలేదని, ఈ చిత్రానికి సంబంధించి అనేక యాదృచ్చిక సంఘటనలు జరిగాయని నాగార్జున చెప్పారు.

తొలి నుంచి తన సన్నివేశాలను ముందుగానే తీసుకోమని నాన్న చెప్తుండేవారని, ఆ సమయంలో తామంతా సమ్మర్ తర్వాత తీసుకుంటామని అంటూ ఉండేవాళ్లమని, ఈ క్రమంలో నాన్నతో కలిసి తామంతా కొంత భాగం షూటింగు చేసిన తర్వాత ఆయనకు క్యాన్సర్ ఉందన్న విషయం తెలిసినట్టు నాగార్జున తెలిపారు. అయినా నాన్న షూటింగులో పాల్గొనడమే కాకుండా తన సన్నివేశాలన్నింటినీ పూర్తి చేశారని ఆయన అన్నారు.

నాగార్జున తన మనసుకు నచ్చి చేసిన మనం సినిమా హిట్టు కొడుతుందని అందరి ఆశ.

ఆడియో పరంగా ఇప్పటికే విజయం సాధించిన ఈ చిత్రంలో నేను పుట్టాను ..అనే పాటను రీమిక్స్ చేశారు. అనూప్ ఈ చిత్రానికి వినసొంపైన సంగీతాన్ని అందించారు.

అమితాబ్ ను అక్కినేని  నాగేశ్వర రావు అల్ రౌండర్ గా పొగిడే వారు. ఆయన అంతలా పొగడటం తాను ఎప్పుడూ చూడని  నాగార్జున తన తండ్రి కోసం ఏదైనా చెయ్యాలనుకుని ఈ అరుదైన చిత్రంలో అమితాబ్ ఉంటే బాగుంటుందని  అనుకుని ఆయనను ఓ అతిధి పాత్రలో నటించేలా చేయడం విశేషం.

ఈ సినిమాలో అఖిల్ నటించలేదు కానీ అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆయన కుటుంబ సభ్యులందరూ షూటింగు లొకేషన్ లో పాల్గొన్న షాట్స్ కొన్నింటిని సినిమా పూర్తి అయిన తర్వాత ప్రేక్షకులకు చూపిస్తున్నారు.

మొత్తం మీద ఇది చూడదగ్గ సినిమా.

Send a Comment

Your email address will not be published.