మనసుకవి వీణ పాటలు

Acharya Aatreyaమనసుకవిగా సుకవిగా పేరు గడించిన ఆత్రేయ పాటలలో కొన్ని తాత్విక చింతనతో కూడినవి. అయితే ఆయన రాసిన పాటలలో ఓ అర డజన్ వీణ పాటలు కూడా ఉన్నాయి. అవి అన్నీ ఇప్పటికీ సంగీత ప్రియుల మనసులను కట్టిపడేసిన పాటలే కావడం విశేషం. డాక్టర్ చక్రవర్తి అనే సినిమాలో ఆయన వీణపై రెండు పాటలు రాసారు.
ఒకటి –
“పాడమని నన్నడగ వలెనా..
పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా…” అంటూ పీ సుశీల పాడిన పాట. ఈ పాటను వెండితెరపై కథానాయకుడి చెల్లెలుపై చిత్రీకరించిన పాట. ఈ పాట గీతాంజలి తెరపై కనిపిస్తుంది.
మరో పాట కథానాయికగా ఈ చిత్రంలో నటించిన సావిత్రిపై చిత్రీకరించారు.
ఆ పాట ఇదే –
“పాడమని నన్నడగ తగునా ….పదుగురెదుటా పాడనా ….. కృష్ణా, పదుగురెదుటా పాడనా…..” అని సాగుతుంది. ఈ పాటలో తన ప్రణయం కృష్ణుడికి మాత్రమె వినిపించాలనే ఆరాధనా భావంతో కూడినది.
అనంతరం ప్రేమనగర్ లోని “ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి – నీ తీగలు సవరించాలి – నీలో రాగం పలికించాలి…” అని మూలపడిన వీణను ఉద్దేశించి రాసిన ఈ పాట గుండెలను పిండేస్తుంది అనడం అతిశయోక్తి కాదు.
అలాగే దేశోద్ధారకులు చిత్రంలోనూ, చక్రవాకం చిత్రంలోనూ ఆత్రేయ మరో మూడు పాటలు వీణ మీద రాసారు.
అవి –
ఒకటి – ఈ వీణకు శృతి లేదు అని సాగే పాట.
రెండు – వీణలోనా తీగలోనా ఎక్కడున్నది నాదము అని సాగే పాట.
మూడు – వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశ్రుతి అని సాగే పాట.

అయితే ఆత్రేయ వీణ పాటలు రాయడం వెనుక ఓ కథ లేకపోలేదు. ఆత్రేయకు ఓ ప్రియురాలు ఉండేది. ఆమె వీణ వాయించడంలో గొప్ప ప్రజ్ఞావంతురాలు. కానీ ఆమెతో ఆత్రేయకు పెళ్ళికాలేదు. ఆమెకు మరొకరితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఓసారి ఆమె కనిపించినప్పుడు ఆత్రేయ “నీతో పెళ్లి జరగలేదు. అందుకే వీణను అటక ఎక్కించాను” అని అన్నారట. ఈ సంఘటన తర్వాత వీణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన హృదయం నలిగిపోయేది.

Send a Comment

Your email address will not be published.