మలుపులతో సాగిన “నిన్ను కోరి”

రొమాంటిక్ కథలతో అందెవేసిన చేయిగా నటించి ఆకట్టుకునే నానీ నటనలో ఇప్పుడు మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డీ వీ వీ దానయ్య నిర్మాతగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే “నిన్ను కోరి”.

ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా నానీతోపాటు నివేతా థామస్ ఆది పినిశెట్టి, తదితరులు నటించారు.

Ninnu_Koriకథలోకి వెళ్తే, విశాఖపట్నంలో పీహెచ్ డీ చేసే నాని పల్లవిని ప్రేమిస్తాడు. నాని పాత్ర పేరు ఉమా మహేశ్వర రావు, నివేతా థామస్ పాత్ర పేరు పల్లవి. పల్లవి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో ఆమె ఉమాను ఎక్కడికైనా సరే తీసుకుపోయి పెళ్లి చేసుకోమంటుంది. డబ్బులు కోసం ఆలోచించవద్దని అంటుంది.

కానీ ఉమా మాత్రం జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కెరీర్ కోసం ఢిల్లీ వెళ్తాడు.

మరోవైపు, పల్లవి తండ్రి తన కూతురు మనసులోని ప్రేమను తెలుసుకోకుండా అరుణ్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టికిచ్చి పెళ్లి చేస్తాడు. పల్లవి కూడా తన ప్రేమను చెప్పలేక పెళ్లి చేసేసుకుంటుంది. అయితే ఆ విధంగా దూరమైపోయిన ఉమా, పల్లవి జీవితాలు, ఉమాను ప్రేమించినప్పటికీ పల్లవిని పెళ్లి చేసుకున్న అరుణ్ జీవితంలోని మలుపులు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసితీరాలి.

కథ చాలా చక్కగా స్పష్టంగా సాగడానికి కారణం దర్శకుడు శివ నిర్వాణ ముందే స్క్రిప్ట్ ని ఏ మాత్రం గందరగోళానికి తావు లేకుండా రాసుకోవడమే అని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రంలో నాని నటన చాలా ఈజీగా సహజసిద్ధంగా ఉంది అనడం అతిశయోక్తి కాదు. ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు దక్కకపోతుండా అనే చిరు ఆశతో నటించిన తీరు బాగుంది. మరోవైపు కథానాయిక నివేతా థామస్ తనకు దూరమైన ప్రేమికుడు నాశనమైపోకూడదననుకుని తపనపడే పాత్రలో నటించిన తీరు బాగుంది. ఆది కూడా చాలా సహజంగా నటించాడు. కథానాయిక తండ్రి పాత్రలో మురళి శర్మ, అతని అల్లుడిగా పృథ్వి నటన కూడా ఓకే.

దర్శకుడు శివ నిర్వాణకు ఇదే మొదటి చిత్రం. అయితే ఆయన కథనాన్ని నడిపించిన తీరు చక్కగా ఉంది. ఎక్కడా అయోమయస్థితి లేదు.
గోపి సుందర్ సంగీతం బాగుంది.

మొత్తం మీద ‘నిన్ను కోరి’ ప్రస్తుత తరానికి అచ్చంగా సరిపోయే కథ అని చెప్పుకోవచ్చు. చూడదగ్గ చిత్రమే.

Send a Comment

Your email address will not be published.