మహానటికి అక్షరాంజలి

ఆమెను చూసీచూడటంతోనే అబ్బో అంత అందం ఇంకెక్కడ చూడగలం అనిపిస్తుంది. అంతేకాదు నటనతోనూ లక్షలాదిమంది హృదయాలను ఆకట్టుకున్న గొప్ప నటి ఆమె. చలచిత్ర పరిశ్రమలో తనదైన శైలితో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఆమె జీవితానికి అలాంటి ముగింపా  అని అనిపించినప్పుడు  ఎంతటివారైనా  కన్నీలు కార్చడం జరిగితీరుతుంది. అంతేకాదు అప్పుడు అనిపిస్తుంది  పగవారికి కూడా అలాంటి దారుణం జరగ కూడదని. ఈ మాటలన్నీ ఎవరి గురించో కాదు అక్షరాలా అందాలన్నింటినీ తనలో పొదుగుకున్న మేటి నటి సౌందర్య గురించే.

1990 దశకంలో చలన చిత్ర పరిశ్రమను తనదిగా చెప్పుకునేలా చేసుకున్న సౌందర్య 1972 జూన్ 18 వ తేదీన సత్యనారాయణ, మంజుల దంపతులకు కర్ణాటకలోని కోలార్ పరిధిలో గల అష్టగ్రామ అనే పల్లెలో  జన్మించారు. ఆమె తండ్రి సత్యనారాయణ కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులు. అయితే సౌందర్య తన తండ్రి పరపతితోకాకుండా తన స్వీయ ప్రతిభతో నలుగురూ చెప్పుకోదగ్గ స్థాయికి చేరిన మహానటిగా నిలిచారు.  ఆమె కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో నటించిన గొప్ప నటి. ఆమెకు అత్యంత సమీప బంధువు, చిన్ననాటినుంచే మిత్రుడు అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీ ఎస్ రఘు  తో 2003 ఏప్రిల్ 27న పెళ్లి అయ్యింది.

ఆమె మొదటిసారిగా నటించిన చిత్రం గాంధర్వ. అది కన్నడ చిత్రం. అప్పుడు ఆమె ఇంకా చదువుకుంటున్న రోజులవి. ఆమెకు డాక్టర్ అవాలని కోరిక. ఎం బీ బీ ఎస్ కోర్సులో చేరింది కూడా. అయితే ఇంతలో ఆమె నటించిన తెలుగు చిత్రం అమ్మోరు విజయవంతమవడంతో సౌందర్య డాక్టర్ కావాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పింది. ఆమెను నటనలో సోదరుడు అమర్ నాథ్ ఎంతో ప్రోత్సహించారు. ఈ అమ్మోరు చిత్రాన్నే తమిళంలో అమ్మన్ అనే టైటిల్ తో తీసారు.

దాదాపు పన్నెండు సంవత్సరాలు సాగిన ఆమె సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందుకున్న సౌందర్య టాలీవుడ్ లో విశేష ఆదరాభిమానాలను సంపాదించింది. 2003లో ఆమెకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుతో ఘనంగా సత్కరించింది. కన్నడంలో ద్వీప అనే చిత్రంలో ఆమె నటనకు జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం దక్కింది. ఆమె నిర్మించి, నటించిన చిత్రమిది. కన్నడ చిత్రాలలోనూ ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమెకు ఏడు సార్లు  ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. మూడు సార్లు నంది అవార్డు లభించింది.

దర్శకులు కె రాఘవేంద్ర రావు, ఎస్ వీ కృష్ణా రెడ్డి, కోడి రామకృష్ణ, క్రాంతికుమార్ తదితరులు ఆమెకు ప్రముఖ పాత్రలలో నటించే అవకాశం ఇచ్చారు.  తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం మనవరాలి పెళ్లి. అది 1992వ సంవత్సరం. అంతపురం, అమ్మోరు, హలో బ్రదర్ తదితర చిత్రాలలో ఆమె నటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్ పరిశ్రమలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్ వంటి మేటి హీరోలతో ఆమె నటించారు. తమిళంలో పోన్ మణి, పడయప్ప, తవసి, అరుణాచలం చిత్రాలు ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. తమిళంలో ఆమె రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ తదితర అగ్రశ్రేణి హీరోల సరసన నటించారు. హిందీలో బిగ్ బీ అమితాబ్ తోను, మలయాళంలో మెగా స్టార్ మమ్ముట్టితోను నటించిన సౌందర్య  “గ్లామర్” పాత్రల్లో నటించేందుకు ఎప్పుడూ ఇష్టపడేది కాదు. ఆమె కుటుంబ, భక్తి రస కథా చిత్రాలనే ఇష్టపడేది. ఈ ఒక్క కారణంతో ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఆమె నటించిన ఆఖరి కన్నడ చిత్రం ఆప్తమిత్ర. ఈ చిత్రంలో ఆమెతోపాటు విష్ణువర్ధన్ నటించారు. ఇది సూపర్ డూపర్ హిట్. ఈ చిత్రం అనేక థియేటర్ లలో ఏడాది పాటు ఆడటం విశేషం. ఆమెకు ఈ చిత్రం ద్వారా మరోసారి ఉత్తమ నటి అవార్డు లభించింది. అయితే ఆమె మరణించిన తర్వాత ఈ పురస్కారం దక్కడం గమనార్హం.

తిరుగులేని తారగా ఎదిగిన సౌందర్య కన్నడ అయ్యంగార్. ఆమె వంద శాతం శాకాహారి. ఆమెకు భగవంతుడిపై యెనలేని భక్తి, విశ్వాసం ఉన్నాయి. ప్రతిభకు ఏ మాత్రం లోటు లేని ఆమెను మృత్యువు 2004 ఏప్రిల్ 17వ తేదీ విమాన ప్రమాద రూపంలో  తనతో తీసుకుపోయి అందరికీ దూరం చేసింది. అది పార్లమెంట్ ఎన్నికల సమయం. బెంగళూరులో బీ జె పీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోవడానికిగాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఒక్క రోజు ముందు జరిగిన వైమానిక ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవలసిరావడం నిజంగా విచారకరం. ఆంద్ర ప్రదేశ్ లోని కరీంనగర్ లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉంది. ఈ కార్యక్రమాన్ని బీ జె పీ వారు ఏర్పాటు చేసారు.  అయితే ఆరోజే ఆమె జీవితంలో ఊహించని విధంగా చివరి రోజు అయ్యింది. సౌందర్య, ఆమె సోదరుడు అమర్ నాథ్, హిందూ జాగరణ వేదిక కార్యదర్శి కె రమేష్, పైలట్ జాయ్ ఫిలిప్స్ లతో బయలుదేరిన విమానం జక్కూర్ వైమానిక క్షేత్రంలో కుప్పకూలింది. అప్పుడు సౌందర్య కాపాడమని అరిచింది. కానీ విషయం తెలిసి  కాపాడేందుకు జనం దుర్ఘటన స్థలానికి చేరుకునే లోపే విమానం మంటల్లో చిక్కుకుని అందులో ఉన్న సౌందర్య, మిగిలిన ముగ్గురు సజీవసమాధి అయ్యారు. ఎదురుగా వచ్చిన ఒక పక్షికి డీ కొనకుండా తప్పించడంకోసం పైలట్ అకస్మాత్తుగా విమాన రూటు మార్చడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఈ విమానంలో సౌందర్య కో-పైలట్ సీటులో కూర్చున్నట్టు  ప్రమాద స్థలిని పరిశీలించిన వారి మాట. ఏదేమైనా విమానంలో ఉన్న నలుగురూ మరణించారన్నది వాస్తవం.

పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మరణించడం ఖాయం. దానిని ఎవరూ తప్పించలేరు. అయినప్పటికీ మంచి మనిషిగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన సౌందర్య జీవితానికి ఇలాంటి ముగింపు సరికాదన్నది అందరూ అనుకునే మాట. పైగా ఆమె పెళ్లి చేసుకుని ఇంకా ఏడాది కూడా పూర్తి చేసుకోక ముందే ఇలాంటి దారుణ ఘటనకు గురవడం విషాదకరం. ఇదంతా చూస్తుంటే దేవుడి నిర్ణయాన్ని సామాన్య మానవులమైన మనం ఎలా మార్చగలం? అతను ఆడించే నాటకంలో మనమంతా రకరకాల పాత్రలు పోషిస్తాం. సమయం  సమీపించగానే ఆ క్షణంలో చుట్టుపక్కల ఎవరున్నా లేకున్నా మన దారిన మనం పోవలసిందే. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.

ఆమె స్మృత్యర్ధం సౌందర్య భర్త, ఆమె వదిన కలిసి అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించారు. సౌందర్య బెంగళూరులో ఒక అనాదాశ్రమానికి సహాయసహకారాలు అందిస్తుండేవారు. అంతేకాదు ఆమె తన జీవితకాలంలో అనేక విద్యాసంస్థలకు విరివిగా విరాళాలు ఇచ్చారు.

అక్కినేని నాగేశ్వర రావు గారులాంటి మహానటులు ఒకానొకసారి  మాట్లాడుతూ ఆరోజుల్లో విజయవంతమైన మాయాబజార్ చిత్రాన్ని మళ్ళీ తీస్తే అందులో పూర్వం సావిత్రి పోషించిన శశిరేఖ పాత్రలో నటించే అవకాశం సౌందర్యకు ఇవ్వాలని గట్టిగా చెప్తానని చెప్పిన మాటలే సౌందర్య అందానికి, ప్రతిభకు ఒక గొప్ప కామెంటుగా భావించవచ్చు. అలాగే అలనాడు విజయవంతమైన నర్తనశాల చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రీమేక్ కు సన్నాహాలు చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టినప్పుడు ఆ చిత్రంలో సౌందర్యకు ద్రౌపది పాత్ర ఇచ్చారు. అయితే ఆర్ధిక సమస్యలతో కొన్ని రోజులపాటు ఆ సినిమా పనులు ఆగిపోవడం, మళ్ళీ షూటింగ్ మొదలు పెడదామనుకునే సరికి సౌందర్య మరణించింది. ఆమెను ద్రౌపది పాత్రలో చూసే భాగ్యం అభిమానులకు లేకుండాపోయింది.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.