మహానటి...ఓ మరపురాని సినిమా

Mahanati Savitriమహానటి ఓ మరపురాని సినిమా అవుతుందన్నది మంగళవారం రాత్రి ఆడియో ఫంక్షన్లో పాల్గొన్నవారందరి ఏకాభిప్రాయం. ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమా టైటిల్ రోల్ చేయడం గురించి చెప్పాల్సిన క్షణాన మాటల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. కీర్తి స్పీచ్ మొదట్లోనే కాస్త నెమ్మదిగా.. ఎక్కువ సేపు మాట్లాడతానంటూ మొదలుపెట్టింది. ఈ రోల్ చేయడానికి తాను ఫస్ట్ నో అనే చెప్పానంది. ‘‘ఈ మూవీ డైరక్టర్ నాగ్ అశ్విన్.. ప్రొడ్యూసర్ స్వప్నా దత్ వచ్చి నన్ను కలిసి మహానటి సావిత్రి జీవిత గాథతో సినిమా తీస్తున్నామని చెప్పారు. నేనేంటి.. సావిత్రి పాత్ర చేయడమేంటి? అది టూమచ్ ఛాలెంజింగ్ రోల్. నావల్ల కాదని చెప్పేశాను. కానీ నాగి స్వప్న మాత్రం వదిలిపెట్టలేదు. నువ్వు చేయగలవంటూ నమ్మకంతో సమాధానం చెప్పారు. నేను కన్విన్స్ అయ్యేంతవరకు వదిలిపెట్టలేదు. అసలు ఈ రోల్ చేసినందుకు మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది నానికే.. నువ్వు ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పినవాడు తనే. థ్యాంక్యూ’’ అంటూ కీర్తి సురేష్ ఈ సినిమా ఓకే చెయ్యడం వెనుక బ్యాక్ గ్రౌండ్ చెప్పుకొచ్చింది.

‘‘ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ కాకపోయినా సమంత నటించింది. హీరో దుల్కర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్యామిలీ ఫ్రెండ్. విజయ్ దేవరకొండతో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా అతడితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అంటూ తన కోస్టార్లను కీర్తి తెగ పొగిడింది. ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులు టెక్నీషియన్లను పేరుపేరునా ప్రస్తావించి వాళ్లందరి నటనను మెచ్చుకుంది.
‘‘నేను ఎన్నో మాట్లాడదామని అనుకున్నాం. కానీ ఇప్పుడు మాటలే దొరకడం లేదు. నేను ఎమోషనల్ గా కనెక్టయిన ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఈ సినిమా చేయడం ఒక అందమైన ప్రయాణం లాంటిది. సావిత్రి గారు ఎక్కుడున్నా ఆవిడ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నా. మా ప్రయాణం పూర్తయింది. ఇప్పుడు దీనిని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. థియేటర్లలో ఈ సినిమా చూసి హిట్ చేయాలని కోరుతున్నా’’ అంటూ మహానటి మూవీతో తనకున్న ఎమోషనల్ ఎటాచ్ మెంట్ గురించి కీర్తి చెప్పుకొచ్చింది.

సావిత్రి ఎంత గొప్ప నటో ముందు తరం వాళ్లందరికీ తెలుసు. ఆమె జీవిత కథతో సినిమా వచ్చిందని తెలిస్తే ఆమె గురించి తెలిసిన వాళ్లంతా సినిమా చూస్తారు. అది అతి నమ్మకం కాదు. ఆత్మవిశ్వాసమే. ఈతరం వాళ్లు తెలుసుకోవాలి. అందుకోసమే మహానటి సినిమా నిర్మించామన్నారు ఈ సినిమా ప్రొడ్యూసర్ స్వప్నాదత్. సావిత్రి జీవితగాథతో మహానటి సినిమా తీయడం వెనుక నేపథ్యాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. మహానటి ఆడియో లాంచ్ ఈవెంట్లో ఈ సినిమా తీయడం వెనుక తాము పడిన శ్రమను వివరించి చెప్పారు.

‘‘ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మమ్మల్ని చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఎందుకు సావిత్రి జీవిత గాథ తీయాలని అనుకుంటున్నారు? సెన్సేషన్ కోసమా.. వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారా.. ఇలా చాలా ప్రశ్నలే వచ్చాయి. ఎవడే సుబ్రహ్మణ్యం తరవాత డైరెక్టర్ నాగిని తరవాత ప్రాజెక్టు ఏంటని అడిగినప్పుడు ఈ సినిమా గురించి చెప్పాడు. అప్పుడు వర్కవుట్ అవుతుందా లేదా కూడా తెలీదు. నాగిపై ఉన్న నమ్మకంతో ముందుకెళ్లాం. మాకు జెన్యూన్ గా అనిపించింది ఒక్కటే. ఈ ఇండస్ట్రీలో 45 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడే ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. వైజయంతి బ్యానర్ కు ఒక గౌరవాన్ని తీసుకురావాలని అనుకున్నాం. అందుకే మహానటిని మీ ముందుకు తెస్తున్నాం.’’ అంటూ స్వప్నా ఉద్వేగంగా మాట్లాడారు.

‘‘ఈ సినిమా ఈ రోజు పూర్తయింది అంటే.. మేమంతా ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే 100 మందికి పైగా టెక్నీషియన్లు పడిన కష్టం. ఈ సినిమాని మొదట నమ్మి వచ్చింది సమంత. ఒక హై పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ఇంకో హీరోయిన్ కథ చెప్పే క్యారెక్టర్ చేయడమంటే గట్స్ ఉండాలి. సమంతకు గట్స్ ఉన్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ అయిన దుల్కర్ ఎప్పుడూ మాకు సహకరిస్తూనే వచ్చాడు. హీ ఈజ్ ఈ ఆబ్ సెల్యూట్ జెంటిల్ మేన్. మూడేళ్ల క్రితం ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అంత కష్టపడ్డాడు. ఈ సినిమాలో చాలా కామియో రోల్స్ ఉన్నాయి. అవెవరు చేశారు ఏంటి అనేది చెప్పను. అవి చూసేవాళ్లకి సర్ ప్రైజ్ గా ఉంటాయి’’ అంటూ ఈ సినిమాపై స్వప్నాదత్ అంచనాలు మరింత పెంచేశారు.

Send a Comment

Your email address will not be published.