మహానటి సావిత్రి

ఆమె మహానటి.
ఆమె నవ్వు మల్లె పువ్వంత స్వచ్చమైంది.
ఆమె కళ్ళతో పలికించే భావాలు అనంతం.
నటనకు ఆమె ఒక పదకోశం.
అందమే అందం….
సుకుమారం, సున్నితత్వం, లాలిత్యం ఇలా ఎన్ని విశేషణాలైనా చెప్పుకుంటూ పోవచ్చు ఆమె గురించి.

ఇంతకూ ఆ మహానటి ఎవరు అని ప్రశ్నిస్తే వెంటనే ఏ మాత్రం తడబడకుండా చెప్పుకునే పేరు సావిత్రి.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చిర్రావూరులో 1933 డిసెంబర్ ఆరో తేదీన జన్మించిన సావిత్రి 48 ఏళ్ళకే కన్నుమూశారు. సావిత్రి అంతిమ దశలో పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె భర్త తమిళ నటుడు జెమినీ గణేష్ కూడా కొన్నేళ్ళ క్రితం కన్ను మూశారు. ఆమె ఇంటి పేరు నిశ్శంకర రావు.

గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు సావిత్రి రెండవ సంతానం. సావిత్రికి ఇద్దరు పిల్లలు. వాళ్ళే….. విజయచాముండేశ్వరి, సతీష్ కుమార్.

నటిగానే కాకుండా దర్శకురాలిగాను, నిర్మాతగానూ చలన చిత్ర జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని మిగిల్చిన సావిత్రి తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించారు.

ఆమె నటించిన మొదటి చిత్రం సంసారం (1950). చివరి చిత్రం గోరింటాకు.

చివరకు మిగిలేది చిత్రంలో ఆమె నటనకుగాను 1960 లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది.

హిందీలో ఏక్ చిట్టీ ప్యార్ భరీ అనే చిత్రాన్ని నిర్మించిన సావిత్రి వెండితెరపై చేయని పాత్రంటూ లేదు. కన్యాశుల్కంలో (1955) మధురవాణి పాత్ర ఎవరూ మరచిపోలేరు. అలాగే నవరాత్రిలో తొమ్మిది పాత్రలలో నటించి మన్ననలు అందుకున్నారు.

తమిళంలో కుళందై ఉళ్ళం (1969), ప్రాప్తం (1971) చిత్రాలకు దర్శకత్వం వహించిన సావిత్రి తెలుగులో చిన్నారి పాపలు (1968), మాతృదేవత (1969), చిరంజీవి (1969), వింత సంసారం (1971) చిత్రాలకు దర్శకత్వం వహించారు.

సావిత్రికి ఏడాది కూడా దాటకముందే తండ్రి టైఫాయిడ్ తో మరణించారు. తన భర్త మరణంతో సుభద్రమ్మ విజయవాడలో ఉంటున్న తన అక్కయ్య దుర్గాంబ ఇంటికి కన్న పిల్లలతో చేరుకున్నారు. సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చదువుకున్నారు. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. విజయవాడలో అక్కడా ఇక్కడా కొన్ని ప్రదర్శనలు ఇచ్చిన సావిత్రి ఎన్టీఆర్, జగ్గయ్య తదితరుల నాటకాల కంపెనీలు వేదికగా చేసుకుని నాటకాలలో నటించారు. ఆ తర్వాత పెదనాన్నసారధ్యంలోని నాట్య మండలిలోనూ నటించిన సావిత్రి 1949లో చలచిత్రాలలో నటించడానికి మద్రాసు చేరుకున్నారు.

ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన సావిత్రి ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవిలోనూ ఒక చిన్న పాత్రలో నటించారు. ఆమె వెండితెర జీవితంలో పెళ్ళిచేసిచూడు చిత్రం ఓ పెద్ద మలుపే అని చెప్పుకోవాలి. ఈ చిత్రం తర్వాత ఆమె వెనుతిరిగి చూడ లేదు.

వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించిన సావిత్రి అనతికాలంలోనే ప్రధాన కథానాయికగా అగ్రస్థానంలో నిలిచారు. దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి, మాయాబజార్, కన్యాశుల్కం తదితర అనేక సూపర్ డూపర్ చిత్రాలలో నటించిన సావిత్రి ఎన్నెన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించి తిరుగులేని మేటి నటిగా లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించారు.

తమిళంలోనూ మహానటి అనిపించుకున్న సావిత్రి 1956లో జెమినీ గణేషన్ ని ఇష్టపడి పెళ్ళిచేసుకున్నారు. సావిత్రిని పెల్లిచేసుకునే నాటికే జెమినీ గణేషన్ కి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే ఆ పెళ్ళి విఫలమై, ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు అలవాటుపడ్డారు సావిత్రి.

దానధర్మాలు చేయవలసి వచ్చినప్పుడు ఏ మాత్రం ముందువెనుకలు చూడక చేసేసే సావిత్రి ఓమారు నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ తన ఒంటి మీద ఉన్న నగలన్నిటినీ తీసేసి ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.

ఆమె చివరి రోజుల్లో జరిగిన ఓ సంఘటనకొస్తే, ఆమెను ఓ కన్నడ నటుడి భార్య నమ్మకద్రోహానికి పాల్పడినట్టు చెప్పుకుంటారు. సావిత్రి ఓ నగల పెట్టెను ఆ కన్నడ నటుడి భార్యకు ఇచ్చి భద్రపరచమని చెప్పారు. మైసూరుకి ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు తానిచ్చిన నగల పెట్టెను ఇవ్వవలసినదిగా సావిత్రి అడిగినప్పుడు కన్నడ నటుడి భార్య “నువ్వు నగల పెట్టె నాకెప్పుడు ఇచ్చావు” అని ఎదురు ప్రశ్నించడంతో సావిత్రి నోట మాట లేదు. ఆమె కంగుతిన్నారు.

“ఏమిటీ? నేను నీకు నగల పెట్టె ఇవ్వలేదా” అని బిత్తరపోయిన సావిత్రి ఆ క్షణంలోనే కుప్పకూలారు. ఆమెను తక్షణమే తొలుత ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుపోగా వారు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించడంతో సావిత్రిని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి లో ఆమెను నేల మీదే పడుకోపెట్టి చికిత్స చేయడం తెలిసి నటి లక్ష్మి ఎంతో బాధపడ్డారు. లక్ష్మి ఆసుపత్రి వారితో గట్టిగా వాదించగా సావిత్రికి ఓ బెడ్ ఏర్పాటు చేసారు. అయితే ఆ తర్వాత ఆమె నోటంట ఒక్క మాట కూడా రాలేదు. ఏడాదిన్నర పైగా కోమాలోనే ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26 న చెన్నైలోని అణ్ణానగర్‌ లో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

ఓ మహానటి జీవితం ఇలా విషాదకరంగా ముగియడం బాధాకరం.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.