"మితం ...పరిమితం"

ఎప్పుడూ స్లిమ్ గా ఎలా ఉంటారు అని అందరూ అడిగే ప్రశ్నే కానీ అందులో రహస్యం ఏదీ లేదని ప్రముఖ నటి త్రిషా చెప్పింది.

“నేను డైటింగ్ పాటిస్తానేమో అని అనిపించవచ్చు. కానీ పరోటా లాగించేసే పోటీ పెడితే గీసుకున్న గీతలు దాటి తినేస్తాను” అని చెప్పుకున్న త్రిషా అన్నింటికీ ఓ హద్దు అంటూ పెట్టుకుంటానని తెలిపింది.

ఆదివారం అంటే తనకెంతో ఇష్టమని, ఆ రోజు ఇక ఫలానాదే తినాలి వంటివేవీ పాటించక నాకు ఎంతో ఇష్టమైన మెనూకి మారిపోతానని చెప్పింది. నాకు ఎంతో ఇష్టమున్న వంటకాలతోపాటు చాక్లెట్ ఐస్ క్రీం అంటూ లాగించేస్తానని చెప్తూ మిగిలిన రోజుల్లో అన్నింటిలోనూ లిమిటెడ్ అని అన్నాది త్రిషా. ప్రత్యేకించి ఇంట్లో ఏది చేస్తే అది తినేస్తానని, కాస్తంత బరువు ఎక్కువైనట్టు అనిపిస్తే కాస్త తగ్గిస్తానని తెలిపింది. సూప్, సాండ్విచ్, ఫ్రూట్ సలాడ్ వంటివి తింటానని, అయితే వాటిలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ఉంటుందని చెప్పింది. ఆతర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వచ్చే బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే అది వాటర్ బాటిల్ అని జవాబు ఇస్తానని త్రిషా తెలిపింది.

షూటింగ్ లేదు అనుకున్న రోజు తప్పనిసరిగా ఇంటికి దగ్గరలోనే ఉన్న జిమ్ కి వెళ్తానని, ఇంట్లోనూ చిన్నపాటి జిమ్ ఏర్పాటు చేసుకున్నానని, అలాగే ఓ యోగా టీచర్ ఇంటికొచ్చి యోగా చేయిస్తారని అన్నాది. అలాకాకుండా షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్తే వీటన్నింటికీ గుడ్ బై చెప్తానని చెప్పిన త్రిషా ఏ నటికైనా జడ, ముఖ సౌందర్యం చాలా ముఖ్యమని, నా ముఖానికీ, కురులకూ కృత్రిమ రసాయనాలు లేని సహజసిద్ధమైన ప్రోటీనులు వాడుతానని చెప్పింది. షూటింగుల కోసం హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటారని, అప్పుడు కొన్ని రకాల కెమికల్స్ స్ప్రే చేస్తారని, దానితో తరచూ కురులకు ప్రోటీన్ ట్రీట్ మెంట్ తప్పనిసరి అవుతోందని వివరించింది.

సౌందర్యానికి చిట్కాలు వంటివి అడుగుతారా అన్న ప్రశ్నకు త్రిషా జవాబిస్తూ ముఖాన ఒకటి రెండు మొటిమలు లాంటివి కనిపించడంతోనే డాక్టర్ ని సంప్రదిస్తానని, ఎప్పుడైనా గుర్తు తెలియని విలన్ లా దోమ కాటేసినా వెంటనే డాక్టర్ ని అడిగి ఆయన చెప్పే సలహా పాటిస్తానని చెప్పింది.

Send a Comment

Your email address will not be published.