ముంబై టు చెన్నై...

చలనచిత్ర రంగంలో మూడు భాషలలోనూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఎల్వీ ప్రసాద్ అకడెమిక్ గా డిగ్రీలూ గట్రా లేకపోవడంతో పాటు ఆర్ధిక సంక్షోభం చవిచూసిన 1930 వ సంవత్సరంలో కొద్దో గొప్పో నాటకాలలో నటించిన అనుభవంతో ఏదోలా సెటిలై పోదామని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బొంబాయి చేరుకున్న క్షణాలు ఆయన జీవితయానంలో ఓ మలుపైంది.

1908 జనవరి 17న ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడులో పుట్టిన ఎల్వీ ప్రసాద్ ఇంట్లోనుంచి ఓ నూరు రూపాయలతో బయలుదేరిన రోజది. తీరా బొంబాయికి చేరుకోవడమైతే చేరుకున్నారు గానీ అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు. అక్కడా ఇక్కడా తిరగ్గా తిరగ్గా చిన్ని చిన్ని పనులు దొరికేవి. వాటితో ఎలాగోలా రోజులు లాగించేసారు. హిందీ రాదు. ఇంగ్లీషు వచ్చినా అది అరకొర ఇంగ్లీష్. ఇంపీరియల్ సంస్థలో చేరిన ఎల్వీ ప్రసాద్ అక్కడి అలవాటుని ఓమారు ఇలా చెప్పారు…

“అక్కడ ఓ యాక్టర్ల గ్రూప్ ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునేవారు. అందులో నన్నుకూడా చేర్చుకున్నారు. అక్కడే పృధ్వీరాజ్ కపూర్ తదితరులతో పరిచయం ఏర్పడింది. పెద్దా చిన్నా అనే తేడా ఉండేది కాదు. అందరూ కలసిమెలసి ఉండే వారు. ప్రతి రోజు సాయంత్రం కవాతు చేయడం…ఇలా ఆనందంగానే రోజులు గడిచిపోయేవి. అక్కడే ఉన్న రోజుల్లోనే హెచ్ ఎం రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. పృధ్వీరాజ్ గారితో ఓ మూకీ చిత్రం చేస్తున్నారు. అప్పుడే టాకీ యుగం మొదలైంది. అర్దేషీర్ గారికి తమిళంలో ఓ సినిమా తీయాలనిపించింది. సావిత్రి అనే టైటిల్ కూడా ఎంచుకుని మొదలుపెట్టారు. అందులో నేనూ ఒక వేషం వేసాను. అలా హెచ్ ఎం రెడ్డిగారితో పరిచయం ఏర్పడింది” అని.

1931 లో హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్, భక్తప్రహ్లాద మూడింటిలోనూ నటించిన క్రమంలో తెలుగువారిలో అలా నటించిన ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఎల్వీ ప్రసాద్ పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవరప్రసాద్.

అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు రెండవ సంతానమైన ఎల్వీ ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి వివిధ భారతీయ భాషలలో దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు కొన్ని చిత్రాలను నిర్మించి కొన్నింటిలో నటించి మంచి మనిషిగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు.

చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించని ఎల్వీ ప్రసాద్ ను మొదటి నుంచీ నాటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఏమాత్రం అవకాశం వచ్చినా నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. చిన్న వేషం వచ్చినా వదులుకునే వారు కాదు. ఈ మార్గమే ఆయనను వెండితెరపైకి కూడా నడిపించింది.

1924లో మేనమామ కుమార్తె సౌందర్య మనోహరమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయస్సు పదిహేడేళ్ళు. ఎల్వీ ప్రసాద్ దంపతులకు ఓ కూతురు, కుమారులు ఆనంద్, రమేష్ పుట్టారు.

ఆలీ షా దర్శకత్వం వహిస్తున్న”కమర్-ఆల్-జమాన్” అనే చిత్రం లో ఎల్వీ ప్రసాద్ కు మొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం లభించింది. ఈ సమయంలోనే ఓ గుమాస్తా ఆయన పేరు మరీ పొడవుగా ఉందని అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ రావుఅనే దానిని ఎల్వీ ప్రసాద్ గా కుదించారు. చివరివరకూ ఆ పేరుతోనే పాపులయ్యారు.

మూడు రీల్స్ తో ఆగిపోయిన “కష్ట జీవి” చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించిన ఎల్వీ ప్రసాద్ ఆ తర్వాత మరికొన్ని చిత్రాలకు కూడా అదే హోదాలో వర్క్ చేసారు.

తీరా 1943లో “గృహప్రవేశం” సినిమాకు కూడా సహాయ దర్శకుడిగా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ ప్రసాద్ అనుకోని పరిస్థితిలో అదే సినిమాకు దర్శకులయ్యారు.అంతేకాదు ఆ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఆ చిత్రం 1946 లో విడుదల అయ్యింది. ఆ చిత్రానికి మ అంచి పేరే వచ్చింది. ఈ చిత్రం అనంతరం కోవెలమూడి ఎస్ ప్రకాశ రావుగారు ఎల్వీ ప్రసాద్ కు “ద్రోహి” లో అనే చిత్రంలో ఓ ముఖ్య పాత్ర ఇచ్చారు.

మిస్సమ్మ, పల్నాటి యుద్ధం, మన దేశం, సంసారం, షావుకారు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎల్వీ ప్రసాద్ భారతీయ చలన చిత్ర రంగంలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించారు.

హైదరాబాదులో ఆయన పేరిట నెలకొల్పిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్ స్టి ట్యూట్ ఎందరికో చూపునిచ్చింది. ఇస్తోంది కూడా.

ఆయన గౌరవార్ధం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ఓ ప్రత్యేక స్టాంపుని విడుదల చేయడం విశేషం.

సినీ రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన ఎల్వీ ప్రసాద్ 1994 జూన్ 22న తుదిశ్వాస విడిచారు.

– చౌటపల్లి నీరజ

Send a Comment

Your email address will not be published.