మెగా స్టార్ కొత్త గెటప్

మెగా స్టార్ పద్మభూషణ్ చిరంజీవి 59వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు తెలంగాణాలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ లోను చిరు పుట్టిన రోజు పురస్కరించుకుని రెండు రాష్ట్రాలలోను అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. లక్ష మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

ఇవన్నీ ఇలా ఉండగా, ఈరోజు అంటే చిరు జన్మదినం నాడు ఆయన 150వ చిత్రం ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు కానీ అది వాయిదా పడింది. రచయితలతో కథలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాతా వెల్లడిస్తామని చిరు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు చిరు న్యూ లుక్ తో ఫొటోకు పోజిచ్చారు. ఆ గెటప్ లో మునుపటికన్నా ఇప్పుడు భలేగా ఉన్నారని అభిమానులు అంటున్నారు.

టూకీగా చిరు జీవిత పుటలు తిరగేద్దాం…

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. 1955 ఆగస్ట్ 22 న మొగల్తూరు (పశ్చిమగోదావరి జిల్లా) లో జన్మించిన చిరంజీవి తల్లిదండ్రులు వెంకటరావు గారు, అంజనా దేవి గారు. 1980 ఫిబ్రవరి 20వ తేదీన అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహమాడిన చిరుకి కొడుకు రామ్ చరణ్, ఇద్దరు కుమార్తెలు (సుష్మిత, శ్రీజ) ఉన్నారు. చిరంజీవికి ఇద్దరు సోదరులు (నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్). ఇద్దరు సోదరీమణులు (విజయదుర్గా, మాధవి). చిరు మేనల్లుడు అల్లు అర్జున్ కూడా నటుడే. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నిర్మాత.

ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెరకు పరిచయమైన చిరంజీవి మొదట్లో కొన్ని నెగటివ్, మైనర్ రోల్స్ లో
నటించారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఖైదీలో నటించిన చిత్రం చిరు కెరీర్ లో ఓ మలుపుతిప్పింది. ఆ తర్వాత చిరు వెనుతిరిగి చూడలేదు. రుద్రవీణ, చాలెంజ్, ఇంటిగుట్టు, శుభలేఖ తదితర చిత్రాలు చిరుకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. 2002 లో కతానాయుకుడిగా విడుదల అయిన ఇంద్ర సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఫిలిం ఫేర్ నంది వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న చిరుకు 2003 లో టాగోర్ సినిమా మరిన్ని రికార్డులు తెచ్చిపెట్టాయి.

సినీ పరిశ్రమకు, సామాజిక పరంగా చేసిన సేవాకార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ 2006 నవంబర్ లో చిరుకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

నిడదవోలు, గురజాల, మొగల్తూరు, బాపట్ల, ఒంగోలు, నర్సాపూర్ తదితర ప్రాంతాలలో చదువుకున్న చిరు ఫిలిం ఇన్ స్టి ట్యూట్ నుంచి 1977 లో ఉత్తీర్ణులయ్యారు. ఫిలిం ఇన్ స్టి ట్యూట్ లో చదువుతున్నప్పుడే పునాది రాళ్ళు అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే సినిమాలో మొదటిసారిగా డైలాగ్ చెప్పిన రోజు 1978 ఫిబ్రవరి 11వ తేదీ. చిరు నటించి విడుదలైన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. 1978 సెప్టంబర్ 22వ తేదీ.

సినీ రంగంలో రానిన్చినంతగా రాజకీయాలలో విజయం సాధించలేకపోయిన చిరంజీవి ఇప్పటి వరకు మొత్తం 149 సినిమాల్లో నటించారు. చిరు 150వ సినిమాకోసం అభిమానులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.