మొదటి పాటకు మూడు వందలు

గానగంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యంతో ఇటీవల బీ బీ సి ముఖాముఖి నిర్వహించింది. ఓ దక్షిణాది కళాకారుడితో బీ బీ సి ఇలా ముఖాముఖి జరపడం ఇదే మొదటిసారి. 1966 లో మొదటిసారిగా ఒక సినిమా పాట పాడిన ఎస్ పీ బాలు ఇప్పటివరకు 39 వేల పాటలుపైనే  పాడారు. ఒకసారైతే ఒకే రోజు మూడు నాలుగు భాషల్లో మొత్తం 21 పాటలు పాడిన బాలు మొదటి పాట వివరాలు ఓ సారి చూద్దాం.

ఆయన సినిమాలో పాడి తొలి పాట… ” ఏమి ఈ వింత మోహం…” అనే పాట. ఈ పాట రచన వీటూరి. ఆ పాట రికార్డు అయిన రోజు 1966 డిసెంబర్ 15వ తేదీ. ఈ పాటను మొత్తం నలుగురు పాడారు. వారు – పీ సుశీల. ఎస్ పీ బాలసుబ్రమణ్యం. ఈలపాట రఘురామయ్య, పీ బీ శ్రీనివాస్. వీరిలో ఎస్ పీ బాలు పాడిన చరణాన్ని శోభన్ బాబు మీద చిత్రీకరించారు. ఈ పాటకు నటించిన వారు – రాజశ్రీ, కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్. ఈ పాటను స్వరపరచిన వారు ఎస్ పీ శ్రీ కోదండపాణి.

1966 లో నిర్మించిన ఈ చిత్రం పేరు శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న. ఇది 1967 లో విడుదలైంది.  ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, పద్యాలు అన్నీనూ వీటూరే రాసారు. ఈయన మాకు బాబాయి అవుతారు. ఈ చిత్రంలో పాడిన గాయనీగాయకులు – పీ బీ శ్రీనివాస్, ఎస్ పీ బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర రావు. కె జె ఏసుదాస్, టీ ఎం సౌందరరాజన్, పీ సుశీల, ఎస్ జానకి, ఈలపాటి రఘురామయ్య.

ఈ సినిమాలో తాను పాడిన మొదటి పాట గురించి బాలసుబ్రమణ్యం గారి మాటల్లోనే చూద్దాం…

“ఇది నా తొలి సినిమా. శ్రీ కోదండపాణిగారి వల్ల ఆ భాగ్యం కలిగింది. మద్రాసులో 1963 లో ఓ పాటల పోటీ నిర్వహించారు.  ఆ పోటీలో నేను పాల్గొన్నాను. ఈ పోటీకి జడ్జీలుగా  వ్యవహరించిన వారిలో కోదండపాణి గారు ఒకరు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి నువ్వు గొప్ప గాయకుడివి అవుతావు, చిరకాలం పాడుతావు, పాడాలి అని చెప్పారు. ఆయన ఆశీస్సులు నిజమయ్యాయి. ఆయన చెప్పినట్టే నేను ఇప్పటికీ పాటలు పాడుతున్నాను.

మొదట్లో ఆయన నన్ను ఎస్ భావనారాయణ గారిదగ్గరకు తీసుకు వెళ్లి పరిచయం చేసారు. ఓ అవకాసం ఇవ్వమని అడిగారు. కానీ అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు. నేను నిరుత్సాహపడ్డాను.  ఏ ఎం ఐ ఈ సెకండ్ ఇయర్ పూర్తి చెయ్యడానికి కాలేజీకి వెళ్లాను.

ఆతర్వాత ఒక రోజు కోదండపాణి గారు నన్ను మళ్ళీ పిలిచారు. పిలిచారు కదాని ఆయన దగ్గరకు వెళ్ళగా నన్ను పద్మనాభం (హాస్య నటుడు) వద్దకు తీసుకు వెళ్లి పరిచయం చేసారు. ఆయన నన్ను ఒక పాట పాడి వినిపించమన్నారు. అప్పుడు నేను ఒకటి రెండు పాటలు పాడి వినిపించాను. ఆయనకు నా గొంతు నచ్చింది. నాకు తప్పకుండా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే అవకాశం ఇచ్చారు కూడా. ఆ పాటే శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలోని “ఏమి ఈ వింత మోహం…” పాట.

నిజానికి ఈ చిత్రంలో నేను పాడవలసిన చరణాన్ని  ఘంటసాల మాస్టారు గారు పాడవలసింది. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిగారిని చూడటానికి స్వస్థలానికి వెళ్ళారు. ఆ కారణంగా ఆయన రికార్డింగుకి రాలేకపోయారు. షూటింగ్ దగ్గర పడటంతో నన్ను పిలిచి ఆ పాటను తాత్కాలికంగా పాడమన్నారు. ఘంటసాల మాస్టారు గారు వచ్చిన తర్వాత ఆయనతో పాడించి నేను పాడిన  చోట ఆయన పాడిన దానిని కలిపేందుకు వీలుగా నన్ను పాడమన్నారు. నలుగురం పాడిన ఆ పాటలో నాకిచ్చిన చరణం ఒక్కటంటే ఒక్కటే.

రికార్డింగు రోజు నన్ను పికప్ చేసుకోవడానికి ఏ కారూ  రాలేదు. కొంచంసేపు నిరీక్షించాను. ఆతర్వాత ఇక కారుకోసం ఎదురు చూడటం సరి కాదని నేను సైకిల్ మీద స్టూడియోకి వెళ్లాను. విజయా గార్డెన్ కు వెళ్ళే వరకు మనసులో తెగ ఆలోచనలు. నా గొంతు వాళ్లకు నచ్చలేదేమోనని.  నేను ఎలాగైతేనేం విజయా గార్డెన్ చేరుకున్నాను. కారుకి మెకానికల్ ప్రాబ్లం వచ్చి నన్ను పికప్ చేయడానికి పంపలేదని తెలిసింది. అక్కడ కొంతసేపు వెయిట్ చేసాను. కోదండపాణి గారు కాస్సేపు తర్వాత నన్ను పిలిచి పాడమన్నారు. ఇరవై నిముషాల్లో పాట రికార్డింగ్ పూర్తయింది. నాకు మూడు వందల రూపాయలు ఇచ్చారు. అందులో వంద రూపాయలు మా నాన్న గారికి పంపాను. అప్పట్లో నేను మద్రాసులో  కొందరు మిత్రులతో కలిసి చదువుకోవడం కోసం ఒక రూములో ఉండేవాడిని. నా ఖర్చులకుగాను  మా ఇంటి దగ్గర నుంచి నాకు నెలకు 80 రూపాయలు వచ్చేవి. అప్పుడు ఇంటికి నేను వంద రూపాయలు పంపుతూ నా ఖర్చు కోసం మీరు నాకు మరో రెండు నెలల వరకు డబ్బులు పంపవలసిన అవసరం లేదని ఒక ఉత్తరం కూడా రాసాను.

పీ బీ శ్రీనివాస్, రఘురామయ్య, పీ సుశీల గార్లతో కలిసి నేను పాడిన ఆ మొదటిపాట ఓ చిరస్మరణీయమైన అనుభవం.

ఘంటసాల మాస్టారు గారు తమ పల్లె నుంచి వచ్చిన తర్వాత నేను పాడిన ఆ పాటను ఆయనకు వినిపించారు. ఆయన పాటంతా విని నా గొంతు బాగుందన్నారు. నేను పాడిన భాగాన్ని అలాగే ఉంచమని ఒత్తిడి చేసారు. ఆయన ఆ మాట నాకు  ఆశీస్సులే. అలాగే కోదండపాణి గారి ఆశీస్సులూనూ. ఆ ఇద్దరి ఆశీస్సులను నేను ఎన్నేళ్ళైనా మరచిపోలేను….” అని.

ఇది ఎస్ పీ బీ పాడిన మొదటి పాట నాటి గుర్తులు.

Send a Comment

Your email address will not be published.