మోడల్ నుండి చిత్ర పరిశ్రమకు...

బాపూగారి శ్రీరామరాజ్యంలో సీతాదేవి పాత్రతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక పేరును నిలబెట్టుకున్న స్టార్ నటి నయనతార. నయనతార మాతృభాష మలయాళం.

nayantharaనయనతార 1984 నవంబరు 18వ తేదీన తల్లి తండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్ లకు పుట్టింది. సిరియన్ క్రైస్తవ కుటుంబానికి చెందిన నయనతార తండ్రి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కావడంతో, ఆయన వివిధ ప్రాంతాలకు బదిలీ కావడంతో ఆమె చదువు వివిధ రాష్ట్రాలలో కొనసాగింది. అప్పటికి ఆయన రిటైర్ అయ్యారు. ఆమె ఇండర్మీడియట్, డిగ్రీ చదువులు మాత్రం కేరళలోనే సాగింది. బీఏ డిగ్రీ ఇంగ్లీష్ సాహిత్యంతో ప్యాసయ్యింది.
కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమె మోడలింగ్ చేయడం ప్రారంభించింది.

కేరళలో 2003లో జరిగిన బెస్ట్ మోడల్ పోటీలో నయనతార మెదటి రన్నరప్ విజేతగా నిలిచారు. ఈ పోటీలను త్రిచూర్లోని అడ్వర్టయిజింగ్ క్లబ్ నిర్వహించింది. ఈ పోటీల తర్వాతే ఆమె మీడియాలోకి ప్రవేశించడం జరిగింది.

అప్పుడు ఆమెను మోడల్ గా చూసిన మలయాళీ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ అనే ఆయన తొలిసారిగా తన చిత్రంలో అవకాశమిచ్చాడు. ఆ చిత్రం పేరు మనస్సినక్కరే. ఈ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికవడం విశేషం. ఆమె నటించిన పాత్ర పేరు గౌరి. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి తదితర మేటి నటుల సరసన నటించిన నయనతార అనంతరం తమిళంలో రంగప్రవేశం చేసింది. తమిళంలో ఆమె చేసిన తొలి చిత్రం పేరు అయ్య. ఈ చిత్రంలో శరత్ కుమార్ సరసన నటించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సెల్వి.

ఇక తమిళంలోనే సూపర్ హిట్ కొట్టిన చంద్రముఖి చిత్రం తెలుగులో అనువదించబడి విడుదలవడంతో ఆమెకూడా ఓ చక్కటి నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత ఆమె తెలుగు పరిశ్రమలో నటించింది. ‘లక్ష్మీ’, ‘బాస్’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార వేసిన సీత పాత్రకు ఫిలిమ్ ఫేర్ అవార్డు దక్కింది. అలాగే నంది అవార్డు కూడా లభించడం విశేషం.

సినిమా వల్లనే కాదు, ప్రేమ వ్యవహారంతోనూ నయనతార పేరు నలుగురి నోటా నానింది. వల్లవన్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడు, సహ నటుడు శింబుతో నయనతార ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ కొన్ని రోజులకే ఆమె ఓ ప్రకటన చేస్తూ శింబుతో ఎలాంటి ప్రేమ దోమా లేదని, తాము విడిపోయామని తెలిపింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం సాగింది. ఈ ప్రేమ కథ కూడా 2012లో మధ్యలోనే ముగిసిపోయింది. ప్రభుదేవాతో ప్రేమకలాపాలు సాగించిన సమయంలోనే నయనతార హిందూమతం స్వీకరించింది. అప్పుడే ఆమె సినిమాలో నయనతార పేరు మీద నటిస్తున్న ఆ పేరునే అధికారిక పేరుగా కూడా వెల్లడించింది. ప్రభుదేవని నయనతార 2009 జూన్ లో రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్లు కూడా నలుగురూ చెప్పుకున్నారు. ఆమె తన చేతిలో ప్రభుదేవ పేరు కూడా అందరికీ తెలిసేలా టాటూ పొడిపించుకుంది కూడా. అయితే 2010 సెప్టెంబర్ లో ప్రభుదేవా తాము పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించాడు. కానీ ఏమైందేమో గానీ ఆ తర్వాత వీరి బంధం తెగిపోయింది. అదే సమయంలో ఆమె క్రిష్ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన కృష్ణంవందే జగద్గురుం చిత్రంలో దగ్గుబాటి రానా సరసన నటించింది. ఈ చిత్రంలో ఆమె జర్నలిస్టు పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఆమెకు మంచి పేరే లభించింది.

2013లో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన గ్రీకువీరుడు చిత్రానికి కూడా మంచి పేరు దక్కింది. ఈ చిత్రంలో ఆమె చీరకట్టుకు పెట్టింది పేరని పలువురు ప్రశంసించారు. నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ అచ్చంగా సరిపోయినట్టు సద్విమర్శలు వచ్చాయి.

మరోవైపు తమిళంలో అజిత్ కుమార్, ఆర్య, ఉదయనిధి (డిఎంకె నాయకుడు, కరుణానిధి కుమారుడు స్టాలిన్ కొడుకు) తదితరులతో నటించిన తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నయనతార తెలుగులో శేఖర కమ్ముల దర్శకత్వంలో అనామిక చిత్రంలోనూ మంచి పాత్రే పోషించింది. ఈ చిత్రం అంతగా విజయం సాధించనప్పటికీ నయనతారకు మాత్రం మంచి పేరే వచ్చింది.

హిందూ మతం స్వీకరించిన తర్వాత ఆమె 2014లో హరిద్వార్, ఋషీకేశ్ తదితర ప్రాంతాలు పర్యటించిన నయనతార కన్నడంలోనూ ఓ చిత్రంలో నటించింది. అది ద్విభాషా చిత్రంగా విడుదలైంది. ఆ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2014కు గానూ లిస్ట్ ఆఫ్ 15 మోస్ట్ డిజైరబుల్ ఉమన్ గా ఆమె పేరును కొచి టైమ్స్ పత్రిక ప్రకటించింది.

ఇలా ఉండగా ఆమె సేవాకార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొంటుందనే పేరుంది. ఆమె ఔదార్యానికి చిహ్నంగా శ్రీలంక తమిళుల రిలీఫ్ ఫండ్ కోసం తమిళనాడు ముఖ్యమంత్రికి అయిదు లక్షల రూపాయలు అందించినట్టు, అప్పుడు మరే నటీ ఇంత సొమ్ము ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

జ్యోతిషపరంగా ఆమె రాశి వృశ్చికం.

ఆమెకు పాటలు వినడమన్నా పుస్తకాలు చదవడమన్నా ఇష్టం.

ఇంగ్లీష్, హిందీ, తమిళం, ఇతర దక్షిణాది భాషలు తెలిసిన నయనతార ఫేవరిట్ ఫుడ్ చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్.

Send a Comment

Your email address will not be published.