యోగి వేమన

డెబ్బయి ఏళ్ళ నాటి చిత్రం యోగి వేమన. వాహినీ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు కె. వి. రెడ్డి రూపొందించిన చిత్రమే ఈ యోగి వేమన. ఈ చిత్ర కథానాయకుడు చిత్తూర్ నాగయ్యకు యెనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది యోగి వేమన.

1947లో విడుదల అయిన చిత్రం.

YogiVemanaకథలోకి వెళ్తే పదిహేడవ శతాబ్దానికి చెందిన రెడ్డి రాజుల వంశానికి చెందినా అనవేమా రెడ్డి ఒక పరగణాకు సామంత ప్రభువు. అతని సోదరుడు వేమారెడ్డి. ఇతనే వేమనగా సుప్రసిద్దుడయ్యాడు. తన అన్నయ్య కుమార్తె అంటే వేమనకు విపరీతమైన ఇష్టం. ఆమె పేరు జ్యోతి. ఇంతలో వేమనకు మోహనాంగి అనే వేశ్యతో పరిచయం ఏర్పడుతుంది. ఆమె మీద ప్రేమతో వేమన తన వదినకు చెందిన బంగారు హారం దొంగిలించి వేశ్యకు కానుకగా ఇస్తాడు. అంతటితో ఊరుకోకుండా తన సోదరుడు ప్రభుత్వానికి చెల్లించవలసిన ధనాన్ని సైతం అపహరిస్తాడు. దీనితో వేమన సోదరుడు జైలుపాలవుతాడు.

రోజులు సాగుతుంటాయి. తనకేది తోస్తే ఆ పనిని యధేచ్చగా చేస్తో వచ్చిన వేమనకు ఓ విషాదం ఎదురవుతుంది. తనకు పంచప్రాణాలు అయిన జ్యోతి చనిపోతుంది. ఈ విషాదం వేమనను కృంగదీస్తుంది. తత్ఫలితంగా వేమన బంధాలకు దూరమవుతాడు. లోకంలోని వాస్తవ పరిస్థితులను సామాన్యులకు సైతం తెలిసేలా పద్యాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఈ పద్యాలను ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుటం చెప్పి తెలుగువారికి చేరువైన వేమనగా చిత్తూరు నాగయ్య నటించారు. ఆయనా వేమన పాత్రలో జీవించారు అనడం తక్కువే అవుతుంది. సమాధిలోకి వెళ్ళిన వేమన విషయ సన్నివేశాన్ని కె వి రెడ్డి కళ్ళకు కట్టినట్టు చిత్రించారు. సమాధి సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు నాగయ్య బిలం లోపలి నుంచి ఊపిరి ఆడక విలవిలలాడుతూ పెద్దగా అరచినప్పుడు గానీ దర్శకులు ఆ షాట్ కి కట్ చెప్పలేదట.

ఈ చిత్రంలో ముదిగొండ లింగమూర్తిరాజమ్మ పార్వతీబాయి తదితరులు నటించారు.

సముద్రాల సీనియర్ సాహ్యితం సమకూర్చగా నాగయ్యే సంగీతం స్వరపరిచారు. ఆయనకు ఒగిరాల రామచంద్ర రావు సహకరించారు. పార్వతి వేశ్యగా నటించారు.

ఈ చిత్రంలో నాగయ్య వేమన పాత్రలో ప్రధమార్థంలో భోగిగాను హేతువాదిగాను కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ చిత్రంలో నాగయ్య ఘంటసాల ఎం వీ రాజమ్మ బెజవాడ రాజారత్నం, బేబీ కృష్ణవేణి తదితరులు పాటలు పాడారు.

ఇక 1988 లో తెలుగులోనే మళ్ళీ వేమన చిత్రాన్ని సి ఎస్ ఆర్ రావు దర్శకత్వంలో నిర్మించారు. విజయ్ చందర్, చంద్రమోహన్, అర్చన, కే ఆర్ విజయ తదితరులు నటించిన ఈ చిత్రంలో ఎస్ పీ బాలసుబ్రమణ్యం, పీ సుశీల, ఎస్ జానకి తదితరులు పాటలు పాడారు.

అయితే నాగయ్య నటించిన వేమన ఇప్పటికీ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
-చౌటపల్లి నీరజ

Send a Comment

Your email address will not be published.