గీతా ఆర్ట్స్ నిర్మాణంలో దర్శకత్వంలో దూపుదిద్దుకున్న చిత్రం ధ్రువ.
ఈ చిత్రంలో కథానాయకుడు రాం చరణ్. తమిళంలో సూపర్ హిట్ చిత్రం తాని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో ధ్రువ టైటిల్ తో చిత్రీకరించారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో రాం చరణ్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి , నవదీప్, పోసాని కృష్ణమురళి, నాజర్ తదితరులు నటించారు.
ధ్రువ పాత్రలో రామ్ చరణ్ నటించిన ఓ ఐపిఎస్ ట్రైనీ. ఈ దశలోనే అతను తన సహచరులతో కలసి సమాజంలో జరిగే నేరాలపై పోరాటం చేపడతాడు. అయితే ధ్రువ బృందం చాలా కష్టపడి శ్రమించి ఎందరో నేరస్తులను పట్టుకుంటుంది. కానీ వారందరూ తమపై నమోదైన కేసుల నుంచి బయటపడి మళ్ళీ నలుగురి మధ్య కాలరు ఎగరేస్తున్నారని తెలుసుకున్న ధ్రువ నేర సామ్రాజ్యంపై దృష్టి కేంద్రీకరిస్తాడు.
ప్రముఖ శాస్త్రవేత్తగా పేరుప్రఖ్యాతులు గడించిన సిద్దార్థ్ అభిమన్యు పాత్రలోనటించిన అరవింద్ స్వామియే సమాజంలోని నేరాలన్నిటికీ సూత్రదారి అని తెలుసుకున్న తర్వాత ధ్రువ ఎలాగైనా అతనిని లక్ష్యంగా చేసుకుని వేట తీవ్రం చేస్తాడు. అయితే వీరి మధ్య ఘర్షణ ఎన్ని మలుపులకు దారి తీసింది తెలుసుకోవాలంటే ధ్రువ చిత్రం చూడాలి.
రామ్ చరణ్ నటన బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతని నటన సింప్లీ సూపర్బ్. మాటలు చాలవు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా రాం చరణ్ నటన అమోఘం. అతని సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ద్రువను ప్రేమించే పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసింది. విలన్ పాత్రలో అరవింద్ స్వామి కూడా చాలా గొప్పగా నటించాడు.
నవదీప్, పోసాని కృష్ణ మురళి తదితరులు కూడా చెప్పుకోదగ్గ రీతిలో నటించారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే బాగుంది. మూలం తమిళమే అయినప్పటికీ తెలుగు కథనం అనువాదంలా అనిపించదు. చక్కగా నడిపించారు కథను. దర్శకుడి ప్రతిభ చూడొచ్చు.
పాటలు సుమారుగా ఉన్నాయి. తమిళంలో కేవలం ఒక్క పాటే ఉంటే తెలుగులో అయిదు పాటలు ఉన్నాయి.
ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్న రాం చరణ్ విజయం సాధిస్తాడనే నమ్మకం ఉంది. ముఖ్యంగా రాం చరణ్ స్థాయిని పెంచే చిత్రం ఇది.