రాజమౌళికి అక్కినేని అవార్డు

Rajamouliమహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఇస్తున్న ఏన్నార్ అవార్డును ఈసారి బాహుబలి దర్శకుడు రాజమౌళికి ఇవనున్నారు.

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.. ఈ నెల 17వ తేదీన జరిగే కార్యక్రమంలో ఉపరాష్ర్టపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేయబోతున్నట్టు నాగార్జున వెల్లడించారు.

ఈ అవార్డు ఇవ్వడం అనేది అక్కినేని నాగేశ్వరరావుగారు ఉన్నప్పటి నుంచే జరుగుతోంది. ఈ అవార్డును ఇప్పటికే ఎందరో ప్రముఖులు అందుకున్నారు.
ఈసారి మన ఆంధ్రుడు ఈ అవార్డును అందుకోబోవడం విశేషం. మనమందరం గర్వించదగిన విషయం కూడా.

బాహుబలి వంటి సినిమాను తీసి దేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా తెలుగువారి కీర్తిని తీసుకుపోయిన రాజమౌళికి ఈ నెల 17వ తేదీన హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమంలో అందజేస్తారు.

ఇప్పటి వరకూ ఈ అవార్డును అందుకున్న వారిలో దేవ్ ఆనంద్, అంజలీ దేవి, షబానా ఆజ్మీ, వైజయంతిమాల, లతా మంగేష్కర్, కె బాలచందర్, శ్రీదేవి, హేమా మాలిని తదితరుల పొరుగు రాష్ర్టాల వాళ్ళే ఉన్నారు. కానీ ఈసారి మన ఆంధ్రుడికి దక్కడం గమనించదగ్గ అంశం.

చివరగా అమితాబ్ బచ్చన్ ఈ ఎన్నార్ నేషనల్ అవార్డును అందుకున్నారు. అది 2014 లో జరిగింది. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అవార్డును గెలుచుకుంటున్న దర్శకుడు రాజమౌళి కావడం విశేషం. అలాగే ఆ నాటి కార్యరక్రమం తర్వాత మళ్ళీ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.

అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి సంతకం:

“మా అబ్బాయి మహాభారతం కథను తప్పకుండా తెరకెక్కిస్తాడు. అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడన్నది చెప్పలేను. వాడికి యుద్ధాలంటే ఇష్టం….”

ఈ మాటలు బట్టే ఎవరు ఎవరి గురించి చెప్పారో అర్థం చేసుకోవచ్చు.

ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారి మాటలవి.

బాహుబలి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి ప్రముఖ దర్శకుడు అని చెప్పడం ఓ చిన్నమాటే అవుతుంది.
రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.

రాజమౌళి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు అయినా ఆయన పుట్టింది మాత్రం కర్నాటకలోని రాయచూర్ ప్రాంతం. 1973 అక్టోబర్ పదో తేదీన జన్మించారు రాజమౌళి.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రాజమౌళికి వరుసకు అన్నయ్య అవుతే భార్య పేరేమో రమ. ప్రతి చిత్రంలోనూ భార్య రమ కీలకపాత్ర పోషిస్తుంటుంది. రాజమౌళి, రమా దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు – కార్తికేయ, మయూఖ. రమకు చిత్ర పరిశ్రమలో దుస్తుల రూపకర్తగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రైతు కుటుంబానికి చెందిన రాజమౌళి నాలుగో క్లాస్ వరకూ కొవ్వూరులోనూ, ఏలూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకూ చదువుకున్నారు. అనంతరం రెండేళ్ళు చదువు ఆపేశారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఇంటర్ కొవ్వూరులో పూర్తి చేశారు.

అనంతరం చదువుకు స్వస్తి పలికిన రాజమౌళికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అదేపనిగా సినిమాలు చూసేవారు. తండ్రి కథారచయిత కావడంతోనూ, కీరవాణి సంగీత దర్శకుడు కావడంతోనూ సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకున్నారు రాజమౌళి.

ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి కొంతకాలం ఏవీఎం రికార్డింగ్ థియేటర్లో పని చేసారు. అనంతరం తండ్రి వెంటే ఆరేళ్ళుండి దర్శకులకు కథలు వినిపించేవారు. అయితే సినిమాలు విడుదల అయిన తర్వాత వాటిని చూసి నిరాశ చెందేవారు. కారణం ఆయన అనుకున్న ఊహలలో అవి ఉండకపోవడమే. దాంతో ఆయనిక లాభం లేదనుకుని తానే దర్శకుడు అవాలనుకున్నారు. తానూహించినట్టుగానే సినిమాను వెండితెరకు ఎక్కించాలనుకున్నారు. పైగా తన తండ్రి దగ్గరే సహాయకుడిగా ఉండే తనకంటూ వ్యక్తిత్వం లేకుండా పోతుందనుకున్నారు రాజమౌళి.

ఆయన తండ్రి అర్థాంగి అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రనిర్మాణంలోనూ వారి కుటుంబం ముఖ్యపాత్ర వహించింది. పైగా అనుకోని సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ సినిమా ఓ కొలిక్కి రావడానికి చాలా సమయం పట్టింది. అప్పుడు రాజమౌళి చెన్నయి నుంచి హైదరాబాదుకి చేరారు. అప్పట్లో లిటిల్ సోల్జర్స్ అనే సినిమా తర్వాత తన రెండో సినిమాకు గంగరాజు దర్శకత్వం వహించే ఆలోచనల్లో ఉన్నారు. గంగరాజుతోనే రాజమౌళి చిత్ర నిర్మాణం గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు. పైగా ఈ రంగంలో ఎవరూ ఒకరికి సహాయం చేయరని, ఒళ్ళు వంచి కష్టించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తెలుసుకున్న రాజమౌళి రాఘవేంద్ర రావును కలిశారు.
కె. రాఘవేంద్ర రావు నిర్మించిన శాంతి నివాసం టీవీ సీరియల్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు. అప్పుడు ఆయన రోజుకు పదిహేడు గంటలు కష్టపడేవారు. ఆ సమయంలో రాజమౌళి పట్టుమని పది సినిమాలు కూడా చూశారా అన్నది ప్రశ్నార్థకమే. ఆయన పనితనాన్ని చూసి రాఘవేంద్రరావుగారు రాజమౌళిని రాక్షసుడు అని పిలిచేవారు.

ఇక వరతో కలిసి రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి పని చేసేందుకు ఎన్నికయ్యారు. అయితే అనుకోని కారణాలతో వర తప్పుకోడవడంతో రాజమౌళి ఆ చిత్రానికి దర్శకుడిగా నిలిచారు. ఆ చిత్రానికి స్క్రిప్ట్ నుంచి దదర్శకత్వం నుంచి అనేక బాధ్యతలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజమౌళి ఇప్పటి వరకు అంటే 2001 నుంచి 2017 మధ్య కాలంలో పన్నెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనమే. ఆ కొత్తదనం రాజమౌళి ట్రేడ్ మార్క్ అని అందరూ అనుకునేలా చేశారు.

స్టూడెంట్ నెం. 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, రాజన్న, ఈగ, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూషన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజమౌళికి సై, సింహాద్రి, ఈగ, బాహుబలి చిత్రాలు మేటి దర్శకుడిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి.

రాజమౌళి ప్రతి సన్నివేశానికి షాట్ డివిజన్ తయారు చేసుకోవడంతో ఓ స్టయిలిష్, సాంకేతిక దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఏ ఉద్వేగానుభూతి సన్నివేశాన్ని పండించగలదో తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నది ఆయన అభిప్రాయం. ఏ కథకైనా టెక్నిక్ అత్యంత ప్రధానమని భావించే రాజమౌళి హాలీవుడ్లో స్క్రీన్ ప్లే ప్రధానమైతే తెలుగు పరిశ్రమలో స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం విభాగాలను వేరు చేసి చూడలేమని అంటూ ఉంటారు.

మీ చిత్రాల్లో హింసాత్మక సన్నివేశాలు కాస్త ఎక్కువే అని ఎవరో ఓ మారడిగితే తనకు వ్యక్తిగతంగా వయొలెన్స్ అంటే తనకిష్టమని రాజమౌళి జవాబిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన రాజమౌళి చిత్రాలలో ఈగ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. అలాగే బాహుబలి ది బిగినింగ్ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అగ్రస్థానంలో నిలిచి ఎన్నో అవార్డులు పొందింది. ఇక రాష్ట్రస్థాయిలో రాజమౌళి మగధీర సినిమా నుంచి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటూనే ఉన్న రాజమౌళి మెల్బోర్న్ లో నిర్వహించిన భారతీయ చలనచిత్రోత్సవంలో టెల్ స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డును (బాహుబలి – 2కు) కూడా అందుకోవడం విశేషం.

Send a Comment

Your email address will not be published.