“ రాజా ది గ్రేట్ “ గ్రేటే

Raja-The-Greatఅనిల్ రావిపూడి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చి దర్శకత్వం వహించిన చిత్రమే “ రాజా ది గ్రేట్ “

రవితేజ, మెహ్రీన్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, సంపత్, ప్రకాష్ రాజ్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం సాయికార్తీక్.

దిల్ రాజు, శిరీష్ చిత్రాన్ని నిర్మించారు.

దాదాపురెండేళ్ల తర్వాత వెండితెరపై కనిపించిన రవితేజ ‘రాజా ది గ్రేట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథలోకి వెళ్తే…
రాజా పాత్రలో రవితేజ నటించాడు. కథపరంగా రాజా పుట్టు అంధుడు. అయితే రాజా తల్లి అతనికి అన్ని విద్యలూ నేర్పిస్తుంది. తల్లి చలవతో ప్రోత్సాహంతో అతను చూపున్న వారికంటే ఎంతో చురుకుగా ఉంటాడు రాజా. అతనిలో ఆత్మవిశ్వాసం అధికం. అతనికి పోలీసు అవాలన్నది ఆశయం. కానీ అతని లక్ష్యానికి అంధత్వం అడ్డుగోడవుతుంది. అయినప్పటికీ పోలీస్ ఆపరేషన్లో తనెలాగైనా పాల్గొనాలని ఆరాటపడతాడు. ఈ విషయంలో గటిట పట్టుదులతో ఉన్న రాజాకు ఓ అవకాశం వస్తుంది. లక్కీ పాత్రలో నటించిన మెహ్రీన్ కౌర్ అనే యువతిని ఒక గూండా నుంచి రక్షించాల్సి వస్తుంది. ఈ క్రమంలో లక్కీ ఎవరు, ఆమెకు వచ్చిన సమస్య ఏంటీ, ఆమె గతమేమిటీ, ఆమెను రాజా ఏ విధంగా కాపాడాడు వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ఇదొక కమర్షియల్ చిత్రం. హీరోని ఓ అంధుడిగా చూపించినా దర్శకుడు కథను నడిపించడంలో విజయవంతమయ్యాడు. కథానాయికను కాపాడటంలో రాజా సేవియర్ అవతారమెత్తుతాడు.

‘రాజా ది గ్రేట్’కు మోస్ట్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోకతప్పదు.

ఎందుకంటే ద్వితీయార్ధంలో సినిమా కాస్త చప్పగా సాగింది. చెప్పుకోవడానికి మలుపులు లేవు. కామెడీ పరవాలేదు. కొన్ని సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ చూపించడం కాస్త విసుగు పుట్టిస్తుంది.

ఏదేమైనా కథను రంజుగానే నడిపిస్తూ చూపడంలో దర్శకుడు క్లిక్కయ్యాడు.

అంధుడి పాత్ర అయినప్పటికీ రవితేజ బాగానే నటించాడు. అతని ప్రతిభ మెచ్చుకోకతప్పదు. అతని ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. అతని కెరీరులో ఇదొక గొప్ప నటనగా చెప్పుకోవచ్చు. కథానాయిక మెహ్రీన్ కౌర్ పరవాలేదు. ఆహా ఓహో అనుకోలేం. ఆమె నటన అతి మామూలుగా ఉంది. రాధిక పాత్ర చిన్నదే. ఆ పాత్రలోనూ ఆమె బాగా నటించింది. రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసరెడ్డి హాస్యం బాగానే ఉంది.
తనికెళ్ల భరణి కూడా బాగానే నటించాడు. ప్రకాష్ రాజ్, సాయికుమార్ ప్రత్యేకించి చెప్పడానికేమీలేదు.

సాయికార్తీక్ సంగీతం సుమారుగా ఉంది. నేపథ్య సంగీతం బాగున్నా పాటలకు సంగీతం యావరేజే. చిత్రంలో కొన్ని సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఆయన మాటలు బాగానే ఉన్నాయి.

అంధుడి పాత్రలో రవితేజా కబడ్డీ ఆడటం, స్టంట్స్ ఆకట్టుకునే రీతిలోనే ఉన్నాయి. రవితేజ -శ్రీనివాసరెడ్డి మధ్య కొన్ని సన్నివేశాలు బాగానే పండాయి.
మొత్తంమీద ఈ చిత్రం చూడదగ్గదే.

Send a Comment

Your email address will not be published.