‘రాజు గారి గది-2’

RajuGari Gadhi2దర్శకుడిగా తొలి ప్రయత్నంలో చేసిన ‘జీనియస్’ అంతగా విజయం సాధించకపోయినా ‘రాజు గారి గది’ చెప్పుకోదగ్గ ఫలితాన్ని ఇచ్చింది. అనంతరం ఈ రాజుగారి గదికే కొనసాగింపుగా అక్కినేని నాగార్జున, సమంత తదితర నటీనటులతో ‘రాజు గారి గది-2’ తో ఓంకార్ మనముందుకొచ్చాడు.

ఈ చిత్రంలో సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, నరేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ తమన్.

ఈ చిత్రానికి రంజిత్ శంకర్ మూల కథ అందించగా అబ్బూరి రవి మాటలు రాశారు.

పీవీపీ సినిమా తదితర సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఓంకార్ కథ, స్క్రీన్ ప్లే రాసి దర్శకత్వం వహించారు.

ఇదొక హర్రర్, కామెడీ చిత్రం.
కథలోకి వెళ్తే….
ఈ చిత్రంలో ముగ్గురు మిత్రుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అశ్విన్ పాత్రలో అశ్విన్ బాబు, రవి పాత్రలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ పాత్రలో ప్రవీణ్ నటించారు. ఈ ముగ్గురూ కలిసి వ్యాపారం చేయాలనుకుని ఒక రిసార్ట్ కొనుగోలు చేస్తారు. వీరి వ్యాపారం సజావుగా సాఫీగా సాగుతుంటుంది. అయితే అనుకోకుండా మిత్రుల మధ్య ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.

ఈ రిసార్టులో ఒక దయ్యం ఉన్నట్లు మిత్రులకు తెలుస్తుంది. ఈ దయ్యం పని పట్టడం కోసం వీరు ముగ్గురూ రుద్ర అనే మెంటలిస్టుని కలుసుకుంటారు. రుద్ర పాత్రలో నాగార్జున నటించారు. రంగంలో దిగిన రుద్ర దయ్యం గుట్టు బయటపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు.

అయినా ఆ రిసార్టులో అసలు దయ్యం ఉందా, ఉన్నట్టయితే ఆ దయ్యం కథ ఏంటీ వంటి వివరాలు తెలుసుకోవాలంటే వెండితెరపై చిత్రాన్ని చూడాలి. గతంలో కన్నా ఇప్పుడు వచ్చిన హార్రర్ కామెడీ కథ అయిన ఈ ‘రాజు గారి గది-2’ చాలా భిన్నమైంది.

ప్రథమార్ధం అంతా ఏదో కాలక్షేపంకోసం నడిచినట్టు అనిపిస్తుంది. అయితే ద్వితీయార్ధంతో కథ పట్టుగా సాగుతూ మనసులను కట్టిపడేస్తుంది.

కామెడీని పండించడంలో తనకంటూ ఓ పంథా ఉన్నట్టు రాజుగారి గదిలో నిరూపించుకున్న ఓంకార్ రాజుగారి గది – 2లో అంతగా పండించలేదు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితర నటులున్నప్పటికీ కామెడీ సన్నివేశాలు అనుకున్నంతగా పండలేదు. అక్కడక్కడా వెన్నెల కిషోర్, షకలక శంకర్ కాస్త నవ్వులు పూయించారు.

నాగార్జున ఓ కొత్త తరహా పాత్రలో అంటే మెంటలిస్ట్ క్యారెక్టర్లో నటించడం ఇదే తొలిసారి. తనకిచ్చిన పాత్రకు నాగార్జున చక్కగా వంద శాతం న్యాయం చేశాడు. అమృత పాత్రలో సమంత నటన అమోఘం. కొన్నిచోట్ల ఆమె తన పాత్రలో లీనమై పోయి నటించి ప్రేక్షకుల కళ్ళంట కన్నీళ్ళు తెప్పించారు. దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా ఈ చిత్రంలో నటించాడు. అతని నటన పరవాలేదు. వెన్నెల కిషోర్ కొన్ని చోట్లే ఆకట్టుకున్నాడు. షకలక శంకర్ విషయానికి వస్తే అతను కూడా కొన్ని చోట్లే నవ్వించాడు. సీరత్ కపూర్ పాత్ర అతి నీరసంగా ఉంది.

తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ఓ అసెట్టే. పాటలకిచ్చిన సంగీతం అంత వినసొంపుగా లేదు. దర్శకుడు ఓంకార్ మలయాళ కథను తిరగరాసుకుని మన నేటివిటీకి అనుగుణంగాతెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. ప్రథమార్థం కన్నా ద్వితీయార్దంలో ఓంకార్ ప్రతిభను చూడొచ్చు. మొత్తంమీదైతే పరవాలేదు. ఓసారి చూడొచ్చు ఈ చిత్రాన్ని.

Send a Comment

Your email address will not be published.