రావు బాలసరస్వతి గారి గానమాదుర్యం అందరికీ తెలిసినదే. ఆమె 1934 లో తొలిసారిగా ఒక పాట పాడారు. అప్పుడు ఆమె వయస్సు ఆరేళ్ళు. హెచ్ ఎం వీ సంస్థ వారు ఒక సోలో పాట రికార్డు చేసారు. ఒగిరాల రామచందర్ రావు, కొప్పరపు సుబ్బారావుల ఆద్వర్యంలో ఈ పాట రికార్డు చేసారు. అప్పుడు రావు బాలసరస్వతి చిన్నతనమది. ఆమెకు మైకు అందలేదు. దానితో ఆమెను ఎత్తుకుని పాట పాడించారు. ఆ పాట పరమపురుషా అని ఆరంభమవుతుంది. నిజానికి ఆమె బాల నటిగానే చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆమె దాదాపు పద్నాలుగు తమిళ, తెలుగు చిత్రాలలో నటించారు. ఆమెకు 1940 లో మొదటిసారిగా ప్లే బ్యాక్ పాడే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పేరు చెంచులక్ష్మి. ఈ చిత్రంలో కమలా కోట్నిస్ నటించారు. సి ఆర్ సుబ్బరామన్ స్వరాలు అందించారు. ఆ చిత్రంలోని అన్ని పాటలు ఆమె పాడారు. కర్నాటక సంగీత బాణీలో సమకూర్చిన పాటలవి. అవి వినడానికి ఎంతో బాగుండేవి. కనిపించితివా నరసింహా – కనిపించినావా ఈ వేళ అనే పాటతో పాటు తిన్నె మీద చిన్నోడా అని జానపద శైలిలో సాగిన పాటే రావు బాలసరస్వతి గారు చలన చిత్ర రంగంలో పాడిన తొలి పాట. ఆ చిత్రంలోని పాటలకు విశేష ఆదరణ లభించడంతో ఆమె నటిగా కాకుండా గాయనిగా స్థిరపడాలని ఆశించారు. ఆమె ఆశయం అలాగే నెరవేరింది కూడా. తాను పాడిన తొలి ప్లే బ్యాక్ పాటకు భీమవరపు నరసింహారావు సంగీతం సమకూర్చారని రావు బాలసరస్వతి ఒక చోట చెప్పుకున్నారు.