రీమేక్ చెయ్యడం పెద్ద సవాల్

ఓ మై గాడ్ తర్వాత విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన ఒక మలయాళం చిత్రాన్ని రీమేక్ కు ఎంచుకున్నారు. మలయాళంలో సూపర్ డూపర్ అయిన దృశ్యం చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. రీమేక్ చెయ్యడంలో విజయవంతులుగా పేరున్న బహు కొద్దిమందిలో వెంకటేష్ ఒకరు.

ఆయన మాట్లాడుతూ తననెవరైనా రీమేక్ హీరో అని చెప్పినా ఆ మాటలు పట్టించుకోనని అన్నారు. ఇక్కడ తగిన సబ్జెక్టు కుదరకపోతే తాను రీమేక్ పై దృష్టి మళ్లిస్తానని చెప్పారు. తానేమీ స్టార్ హోదాతో ఏదో ఆనందించాలనో లేక ఏదో పాపులారిటీ కోసమో చిత్ర పరిశ్రమకు రాలేదని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అభిమానులు తన నటనను ఆదరించారని, అది నిలుపోగలిగితే చాలని చెప్పారు. రీమేకా లేక ఒరిజినలా అనేది పక్కన పెడితే అనుకున్న దానిలో ఎంత వరకు విజయం సాధించామనేదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. రీమేకులు తననేప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఈ క్రమంలో తాను ఎంతో మెరుగుపడ్డానని, కొన్ని రీమేక్ చిత్రాలు ఒరిజినల్ కన్నా బాగా ఆడాయని ఆయన గుర్తు చేసారు.

ఇప్పుడు చేస్తున్న దృశ్యం చిత్రం తన కెరీర్ లో ఒక పెద్ద మలుపు కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. తానీ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించానని అన్నారు. ఈ చిత్రం కథ చాలా గాడమైనదని కూడా చెప్పారు. స్క్రీన్ ప్లే కూడా ఎంతో గొప్పగా ఉందన్నారు. అందుకే ఈ చిత్రం రీమేక్ కు నిర్ణయించుకున్నానని చెప్పారు. రీమేక్ చెయ్యడం అంటే మాటలు కాదని, అదొక పెను సవాల్ అని తెలిపారు.

ఇతర భాషల్లో అగ్రశ్రేణి నటులే నటించారని, కనుక తాను కూడా వారికి ఏ మాత్రం తగ్గ కుండా నటించడం ముఖ్యమని వెంకటేష్ చెప్పారు. తనకంటూ ఒక బాడీ ల్యాంగ్ వేజ్ ఉందని, తనకంటూ ఒక తీరు ఉందని, దానికి మరింత మెరుగులు దిద్ది నటించానని తెలిపారు.

తానీ చిత్రంలో చెయ్యడం తెలిసి కమల్ హాసన్ ఎంతో సంతోషించారని ఆయన చెప్పారు. తానీ చిత్రానికి అన్ని విధాలా సరిపోతానన్నది కమల్ అభిప్రాయమని కూడా చెప్పారు. కొత్త కొత్త ఫిల్మ్స్ చెయ్యడానికి ప్రయత్నించమని కమల్ సూచించారని అన్నారు.

కమల్ నే కాకుండా అమితాబ్ ను కూడా ప్రేరణగా తీసుకున్నానని వెంకటేష్ చెప్పారు. తన వయస్సు యాభై దాటిందని, తానిక బరువైన పాత్రలు వెయ్యడం ప్రధానమని కూడా అన్నారు. ప్రేమించుకుందా రా, ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాలు తానీ వయస్సులో చెయ్యడం అంత అర్ధవంతంగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

కమల్, అమితాబ్ లను స్పూర్తిగా తీసుకుంటూనే అదే సమయంలో తన కు ఏది సరిపోతుందో కూడా ఆలోచిస్తానని ఆయన తెలిపారు. ఈ దృశ్యం చిత్రం తర్వాత చాలామంది రచయితలు, దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారనే నమ్మకం తనకుందని అన్నారు.

తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడుతూ వాడిప్పుడే ఈ రంగంలోనికి రావడం లేదని, దృశ్యం చిత్రంలో ఒక కుర్రాడి పాత్ర ఉందని, చాల మంది తన కొడుకే ఆ పాత్ర పోషిస్తాడని చాలా మంది అనుకున్నారని, కానీ అతను ఈ చిత్రంలో నటించడం లేదని కూడా ఆయన చెప్పారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన సామాన్యుడు కాదని, ఆయనిప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించాడని, ఆయనకు అంతా కలిసి రావాలని కోరుకున్నానని విక్టరీ వెంకటేష్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.